కర్ణాటక(యశవంతపుర): ఆ ఇంట్లో అందరూ దొంగలే. తల్లి, ఆమె తనయుడు, తనయ మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలబాట పట్టారు. ఎట్టకేలకు ముఠాకు చెందిన 8 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఉత్తర విభాగం డీసీపీ వినాయక పాటిల్ వివరాలు వెల్లడించారు. బెంగళూరులోని మాదనాయకనహళ్లి దొమ్మరహళ్లి నివాసి మంజునాథ్ అలియాస్ కోళిమంజ(31), అతని తల్లి ప్రేమ(50), అయన చెల్లెలు అన్నపూర్ణ అలియాస్ అను(28), లగ్గేరి నివాసి దీపక్ అలియాస్ దీపు(31), గంగానగరకు చెందిన మను అలియాస్ మహేంద్ర(21), దయానంద్ అలియాస్ దయా(25), మునిస్వామి అలియాస్ స్వామి(34), సతీశ్(24)లను ఉత్తర విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.45 లక్షల విలువైన 332 గ్రాములు బంగారం, రూ.59 వేల నగదు, 23 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఉపాధ్యాయురాలు జనవరి 10న బీఎంటీసీ బస్ దిగి కాలినడకన వెళ్తుండగా బైకుపై వచ్చిన దుండగులు ఆమె మెడలోని 50 గ్రాములు బంగారు మాంగల్య చైన్ లాక్కొని ఉడాయించారు. ఈ చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. నిందితులు అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment