
శ్రీనగర్: 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతర మార్పులను జమ్మూకశ్మీర్ ప్రజలు ఆమోదించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఉగ్రవాద చర్యలు, రాళ్లు రువ్వడం వంటి ఘటనలు 70% తగ్గిపోయాయన్నారు. ఇప్పుడు కొత్త జమ్మూకశ్మీర్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. మంత్రి శుక్రవారం శ్రీనగర్‌లో జరిగిన ‘వితస్త కల్చరల్ ఫెస్టివల్’కు హాజరయ్యారు.
గత 30–40 ఏళ్ల జమ్మూకశ్మీర్ చరిత్ర మాత్రమే తెలిసిన వారు ఇది ఒక సమస్య అని, దీనిని వివాదాస్పద ప్రాంతంగానే భావిస్తారన్నారు. అదే జమ్మూకశ్మీర్ ఇప్పుడు వితస్త ఉత్సవాలు జరుపుకుంటోందని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదంతో బలైన 42 వేల మంది ప్రజల బాధ్యతను ఎవరు తీసుకుంటారని అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్(పీడీపీ)లను ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 370తో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ సిద్ధాంతకర్త శ్యామాప్రసాద్ ముఖర్జీకి ఆయన నివాళులర్పించారు.