సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పూర్తికాలం పదవిలో కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కర్ణాటక ప్రజలు, రైతుల అభివృద్ధి విషయంలో యడియూరప్ప నిర్లక్ష్యం చేయలేదన్నారు. దీంతో సీఎం పీఠం మార్పుపై వస్తున్న ఊహాగానాలకు అమిత్ షా తెరచించారు. బెళగావిలో ఏర్పాటు చేసిన జనసేవక్ ముగింపు సమావేశంలో అమిత్‌షా పాల్గొని ప్రసంగించారు. కర్ణాటక ప్రజలు 2014–19 మధ్య కాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఆదరించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కర్ణాటకలో కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం దివంగత కేంద్ర మాజీ మంత్రి సురేశ్ అంగడి నివాసానికి అమిత్‌షా వెళ్లారు. సురేశ్ అంగడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. (చదవండి: యడియూరప్ప స్థానంలో యువ సీఎం!)
అసంతృప్త నేతలపై షా గరం..
కాగా శనివారం రాత్రి బెంగళూరులో ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. పార్టీ కంటే గొప్పవాళ్లు ఎవరూ లేరని.. పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు. పార్టీ నిబంధనలను ధిక్కరిస్తే.. ఎవరిపైనా అయినా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.
రైతులకు లబ్ధి చేకూర్చేందుకే చట్టాలు..
దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను తీసుకొచ్చిందని అంతేగాక ఇంధన ఉత్పత్తిలో రైతులను భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీర్మానించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. బాగల్‌కోటె జిల్లా బాదామి తాలుకా కెరకలమట్టిలో ఎంఆర్ నిరాణి గ్రూపు కంపెనీలో భాగమైన కేదార్‌నాథ్ చక్కెర కర్మాగారాన్ని ఆదివారం ఆయన పునః ప్రారంభిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం రాక ముందు పెట్రోల్, డీజిల్ తయారీలో ఇథనాల్ శాతం 1.84 శాతంగా ఉండేదన్నారు. 2025 వరకు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో ఇథనాల్ ప్రమాణ శాతాన్ని 20కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో సీఎం బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి, డిప్యూటీ సీఎం గోవింద కారజోళ, మంత్రులు మురుగేష్ నిరాణి, జగదీశ్ శెట్టర్, బసవరాజు బొమ్మై, బీసీ పాటిల్, శశికళ జొల్లె, ఆర్.శంకర్, ఎంపీలు పీసీ గద్దెగౌడరు, రమేశ్ జిగజిణగి, జీఎం సిద్దేశ్వర తదితరులు పాల్గొన్నారు. బెళగావికి అమిత్‌షా వస్తున్న విషయం తెలుసు కున్న రైతులు పెద్ద సంఖ్యలో విమానాశ్ర యం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment