సాక్షి, ముంబై: మహిళలు, ఆడ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముంబైలో అదనంగా మరో 7 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్ వెల్లడించారు. ఏటా ముంబైలో వందలాది మంది ఆడ పిల్లలు అదృశ్యమవుతున్నారు. గడిచిన మూడేళ్లలో 3,519 మంది ఆడ పిల్లలు అదృశ్యమయ్యారు. ఆధారాలు, సీసీ కెమెరాలు అనేక చోట్ల లేకపోవడంతో వారి ఆచూకీ లభించడం లేదు. ఫలితంగా ఆ అదృశ్యమైన కేసులు చేధించడంలో పోలీసులు సఫలీకృతం కాలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నగరంలో ఉన్న 5 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరో 7 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సతేజ్ పాటిల్ వివరించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇదే క్రమంలో నగరంలో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. పరీక్ష తప్పడంతో తల్లిదండ్రులు మందలించారని కొందరు, గొడవ పడి, ప్రేమలో పడి మరికొందరు ఇళ్ల నుంచి పారిపోతారు. ఆ తరువాత ఇంటికి వెళ్లలేక, ఎక్కడికెళ్లాలో తెలియక రోడ్లపై, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ ఆవరణల్లో, ప్లాట్‌ఫారాలపై తిరుగుతుంటారు. ఆ తరువాత ఎవరి మాయలోనో పడి అదృశ్యమవుతారు. (చదవండి: 15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్!)
ఇలాంటి కేసులు నిత్యం ముంబైలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదవుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని కేసులను పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చేధిస్తారు. మరికొన్ని కేసులు ఆధారాలు లేక అలాగే పెండింగులో ఉంటాయి. దీంతో అదనంగా మరిన్ని సీసీ కెమెరాలు అమర్చితే అదృశ్యమైన యువతులు, బాలికలు ఎలా వెళ్లారు, ఏ మార్గంలో వెళ్లారో ఆచూకీ వెంటనే కనుక్కొని కేసులను సత్వరమే పరిష్కరించవచ్చని సతేజ్ పాటిల్ అభిప్రాయపడ్డారు. కేసులు చేధించకపోవడంతో ఇప్పటికే అనేక రంగాల నుంచి పోలీసు శాఖ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక అలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. (చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు..)
Comments
Please login to add a commentAdd a comment