జైల్లో జైన్‌కు పడక సిద్ధం చేస్తున్న సిబ్బంది
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‌కు అందుతున్న రాజభోగాలపై రోజుకో వీడియో వెలుగులోకి వస్తోంది. తాజాగా ఒక వ్యక్తి ఆయన గదిని శుభ్రం చేయడం, పక్క శుభ్రంగా సర్దడం వంటి దృశ్యాలు కనిపించాయి. జైన్‌కు కావల్సినవన్నీ చేసి పెట్టడానికి దాదాపుగా 10 మంది సేవకుల్ని కేటాయించినట్టుగా తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. గది శుభ్రం చేయడం , మంచంపై దుప్పట్లు మార్చడం, బయట నుంచి ఆహారం, పళ్లు, మినరల్ వాటర్ తేవడం, బట్టలుతకడం వంటి పనుల కోసమే ఎనిమిది మంది ఉన్నారు.
వారందరూ సరిగా పనులు చేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడానికి మరో ఇద్దరు వ్యక్తులు ఉంటారని తీహార్ జైలు వర్గాలు జాతీయ చానెళ్లకు వెల్లడించాయి. జైల్లో సత్యేంద్ర జైన్‌కు అందుతున్న సకల సదుపాయాలపై ఢిల్లీ కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తాను ఉల్లి, వెల్లుల్లి లేని జైన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటానని, అది తనకు జైల్లో ఇవ్వడం లేదంటూ సత్యేంద్ర జైన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పళ్లు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం లేదన్న ఆ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధల్ తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment