న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సత్ఫలితాలిస్తుండటంతో ఢిల్లీలో మరో వారం పాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ వెల్లడించారు. మే 31 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానున్నట్లు సీఎం పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో రోజువారీ కోవిడ్ కేసుల తగ్గుదల కొనసాగితే అన్‌లాక్ ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అన్‌లాక్ ప్రక్రియ నెమ్మదిగా ఉంటుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటును తగ్గించడానికి నగరం కష్టపడుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
‘‘కరోనా ప్రస్తుత వేవ్ ఎప్పుడు తగ్గుతుందో తెలియదు.. కానీ ఈ నెల రోజులు ఢిల్లీ ప్రజల సహకరించారు. ఢిల్లీ ఓ కుటుంబంలా వైరస్‌తో పోరాటం చేసింది. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత కూడా ఉంది.. అయితే దీనికి కూడా త్వరలో పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నా.’’అని కేజ్రీవాల్ అన్నారు. కాగా ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో గత నెల 18 న లాక్‌డౌన్ విధించారు. అప్పటి నుంచి లాక్‌డౌన్‌ను.. ప్రతివారం పొడిగిస్తూ వస్తున్నారు.
లాక్‌డౌన్‌కు ముందు మహమ్మారి సృష్టించిన విలయంతో ఢిల్లీలో దయనీయ పరిస్థితులు నెలకున్నాయి. ఆక్సిజన్ కొరతతో పలు అస్పత్రుల్లో వందల సంఖ్యలో రోగులు మృతిచెందారు. మృతదేహాలకు అంత్యక్రియల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ మధ్య నాటికి ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతానికి చేరింది. దీంతో ఆరోగ్య వ్యవస్థలు దాదాపు కుప్పకూలిపోయాయి. కాగా, గతవారం 11.32 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 2.5 శాతానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment