
ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఓ సైనికుడు తోటి సిబ్బందిపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని మరణించాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దక్షిణ మణిపూర్‌లోని మయన్మార్ సరిహద్దు సమీపంలో మోహరించిన అస్సాం రైఫిల్స్ బెటాలియన్‌లో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ కాల్పులకు మణిపూర్‌లో కొనసాగుతున్న జాతుల ఘర్షణతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు వెల్లడించారు.
కాగా కాల్పులకు పాల్పడిన సైనికుడిది రాష్ట్రంలో హింసకు కేంద్ర బిందువైన మయన్మార్ సరిహద్దు ప్రాంతం చురాచాంద్‌పుర్ కావడం గమనార్హం. అతడు కుకీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే గాయపడిన ఆరుగురు సైనికులు మణిపూర్‌కు గానీ, మైతీ చెందిన వారు కాదని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రులను ఆర్మీ ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
మణిపూర్‌లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం విదితమే. అప్పటి నుంచి అడపాదడపా హింసాత్మక సంఘటనలు నమోదవుతునే ఉన్నాయి. అధికారులు, పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఇటీవల ఈశాన్య రాష్ట్రంలో మరోసారి కాల్పుల మోత మోగింది. వివిధ ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు.
చదవండి: రాహుల్ భద్రతపై అమిత్‌షాకు ఖర్గే లేఖ