లక్నో: దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా రామ మందిర నిర్మాణం భూమి పూజ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్యలో కరోనా కలకలం రేపుతోంది. రామ జన్మభూమి మందిర పూజారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ప్రధాన పూజారి సహాయకుడు ప్రదీప్ దాస్‌కు కరోనా వచ్చినట్లు సమాచారం. అంతేకాక ఇక్కడ విధులు నిర్వహిస్తోన్న మరో 16 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దాంతో ఇక్కడి పూజారులు, పోలీసులు ఆందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన ప్రభుత్వాధికారులు.. అయోధ్య ప్రాంతంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. కాగా, ఆగస్టు 5వ తేదీన జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధానితో పాటు 50 మంది ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 200 మందితో ఈ భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది.
అయోధ్యలో జరిగే ఈ భూమి పూజ కార్యక్రమాన్ని వీక్షించేందుకు గాను నగరం అంతటా భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతున్న నరేంద్ర మోదీ హెలిప్యాడ్ నగరంలోని సాకేత్ కాలేజీలో దిగుతుంది. అక్కడ నుంచి ప్రధాని కాన్వాయ్‌లో వేడుక జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాల గోడలపై రామాయణంలోని వేర్వేరు పాత్రలను చిత్రీకరించనున్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల పరిధి మేర ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు అయోధ్య సమాచార డిప్యూటీ డైరెక్టర్ ధార్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment