సమాజంలో నిత్యమూ అధికారం గల వారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురవుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక, ఆర్థిక న్యాయం కోసం వాదించారు రావిశాస్త్రి.
రాచకొండ విశ్వనాధ శాస్త్రి న్యాయవాది, రచయిత. రావిశాస్త్రిగా ప్రసిద్ధులైన ఆయన తన కథల్లో కూడా న్యాయవాదే! çసమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అధోజగత్ సహోదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పిన ప్రతిభావంతుడు ఆయన. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేశారు.
నేడు రావిశాస్త్రి 101 వ జయంతి. రావిశాస్త్రి.. నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922 జూలై 30 న శ్రీకాకుళంలో జన్మించారు. తండ్రి న్యాయవాది. తల్లి సాహితీకారిణి. ఇద్దరి అంశతో ఆయన జన్మించినట్లున్నారు! ఆరంభంలో కఠోర కాంగ్రెస్ వాది అయినా తర్వాత్తర్వాత మార్క్సిస్టు సిద్ధాంతాలతో ప్రభావితం అయ్యారు. 1947 ప్రాంతంలో న్యాయవాద వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల జన జీవితాలు విస్తృతంగా ఆయన పరిశీలనకు వచ్చాయి. అలాగే పట్టణ జీవితంలో వస్తున్న పెనుమార్పులను గమనించారు. రచనల్లో గురజాడ అప్పారావు, శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న నమాజంలో గిలగిలలాడే వారి ఆరాటాలను తన రచనలలో చిత్రించారు. తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన ‘అల్పజీవి’ విలక్షణమైనది. జేమ్స్ జాయిస్ ‘చైతన్య స్రవంతి‘ ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల అది.
ఈ నవలను ఆయన 1952లో రాశారు. తరువాత రాజు మహిషీ, రత్తాలు–రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించారు. తన జీవిత చరమాంకంలో ‘ఇల్లు’ అనే నవల రాశారు. ఆంధ్రాలో మద్యపాన నిషేధ చట్టం తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ‘ఆరుసారా కథలు’ తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి ఆలోచన రేకెత్తించాయి. అధికార గర్వానికి ధన అహంకారం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఆయన ‘నిజం’ నాటకంలో అతి శక్తిమంతంగా చిత్రీకరించారు. రావిశాస్త్రి కథకులు మాత్రమే కాదు, మంచి నటులు కూడా. తను రాసిన ‘నిజం’ నాటకంలోను, గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకంలోను నటించారు. ‘రచయిత తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడుకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను’ అన్నారు రావిశాస్త్రి. పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడి, ‘విరసం’ వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాల నెదిరించి నెలల తరబడి జైలుపాలై, తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993 నవంబర్ 10 ఆయన తుదిశ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment