అనితా మజుందార్ దేశాయి నవలా రచయిత్రి, విశ్వవిద్యాలయ ఆచార్యులు. రచయిత్రిగా మూడుసార్లు బుకర్ ప్రైజ్‌కు నామినేట్ అయ్యారు. 1978లో ‘ఫైర్ అన్ ది మౌంటెన్’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆమె ‘ద విలేజ్ బై ది సీ’ రచనకు బ్రిటిష్ గార్డియన్ ప్రైజ్ లభించింది. అనితా మజుందార్ నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలోని ముస్సూరీలో 1937 లో జన్మించారు. అనిత తన ఏడవ యేట నుండే రచనలు చేయడం ప్రారంభించారు. తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే ఆమె మొదటి కథ అచ్చయింది. అనిత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 1957లో ఆంగ్లసాహిత్యంలో పట్టభద్రురాలయ్యారు.
అదే సంవత్సరం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ డైరెక్టర్, రచయిత అయిన అశ్విన్ దేశాయిని వివాహం చేసుకున్నారు. అనిత వారాంతాలలో తన పిల్లలను అలీబాగ్ సమీపాన ఉన్న తుల్ కు తీసుకెళ్లేవారు. అక్కడి అనుభవాలు, సంగతుల ఆధారంగానే ఆమె ‘ది విలేజ్ బై ది సీ’ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం 1983లో గార్డియన్ చిల్డన్స్ర్ ఫిక్షన్ ప్రైజ్‌ను గెలుచుకుంది. బ్రిటీష్ బాల సాహిత్య సృజనకారులు ఈ పుస్తకానికి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. 1963లో అనితా దేశాయి తన మొదటి నవల ‘క్రై ది పికాక్’ వెలువరించారు. 1980లో ‘క్లియర్ లైట్ ఆఫ్ డే’ ప్రచురించారు. దీనిని ఆమె తన జీవన స్మృతుల ఆధారంగా రాశారు.
1984 లో ‘ఇన్ కస్టడీ’ నవల అచ్చయింది. ఇది ఒక ఉర్దూ రచయిత చరమాంక జీవితాన్ని ప్రతిబింబించిన రచన. 1993లో అనితా దేశాయి మసాచుసెట్ సాంకేతిక విద్యాలయంలో క్రియేటివ్ విభాగంలో అధ్యాపకురాలిగా చేరారు. 2011లో ‘ద ఆర్టిస్ట్ ఆఫ్ డిసప్పీయరెన్స్’ కథాసంకలనాన్ని తెచ్చారు. ఆమె రచించిన ఇన్ కస్టడీ నవల ఆధారంగా 1993లో అదే పేరుతో ఆంగ్లంలో చలనచిత్రం వచ్చింది. దీనిని మర్చంట్ ఐవరీ ప్రొడక్షన్స్ నిర్మించింది. షారుక్ హుస్సేన్ చిత్రానువాదం చేయగా, ఇస్మాయిల్ మర్చంట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి భారత రాష్ట్రపతి నుండి ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కింది. చిత్రంలో శశి కపూర్, షబనా అజ్మీ, ఓంపురి తదితరులు నటించారు. (నేడు అనితాదేశాయ్ జన్మదినం).
Comments
Please login to add a commentAdd a comment