బ్యాంకుల జాతీయకరణ
ప్రైవేటు వ్యాపారవేత్తల యాజమాన్యంలోని రూ.50 కోట్ల డిపాజిట్‌లను కలిగి ఉన్న 14 బ్యాంకులను 1969 జూలై 19న ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. బ్యాంకుల జాతీయకరణ అనే పేరుతో ఈ చర్య పేర్గాంచింది. ప్రైవేటు రంగం తన సొంత వినియోగానికి భద్రంగా నిల్వ చేసి పెట్టుకున్న వనరులను ప్రజల కోసం విముక్తం చేయడమే ఈ జాతీయకరణ ఆశయం అని ప్రభుత్వం ఆనాడు ప్రకటించింది. ఆ తర్వాత 1980 ఏప్రిల్‌లో మరో 6 బ్యాంకులను జాతీయం చేశారు. కొన్ని విధాలుగా ఈ చర్య సత్ఫలితాలనే ఇచ్చింది.
1969లో 8,261 మేరకు ఉన్న బ్యాంకు శాఖల సంఖ్య 2000 నాటికి 65,521 కి చేరుకుంది. అంతకుముందు 65 వేల మందికి ఒక శాఖ చొప్పున ఉంటే ఆ తర్వాత 15 మందికి ఒక శాఖ చొప్పున ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ ఇరవై ఏళ్లలో బ్యాంకింగ్ రంగం పురోగమించి ఒక్కో ఏటీఎం సెంటర్ ఒక్కో బ్యాంకు శాఖలా సకల సేవల్ని అందిస్తోంది. జాతీయకరణ తర్వాత రైతులకు మరిన్ని నిధులు దక్కాయి. కానీ అందుకు బ్యాంకులు మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. వ్యాపార ప్రయోజనాలను బట్టి కాక, రాజకీయ ప్రయోజనాలను బట్టి రుణాలు మంజూరవడం మొదలైంది. రానిబాకీలు పేరుకుని పోవడంతో బ్యాంకుల్ని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రభుత్వమే 20 వేల కోట్ల రూపాయల వరకు సర్దవలసి వచ్చింది. మరోవైపు జాతీయకరణ వల్ల ప్రయోజనం తీరిపోయిందనే అభిప్రాయం కొంతకాలంగా గట్టిగా వినిపిస్తోంది. దీనికి కారణం ప్రైవేటు బ్యాంకులు వేగంగా వృద్ధి చెందుతూ ఉండటమే.
Comments
Please login to add a commentAdd a comment