ధుండిరాజ్ గోవింద ఫాల్కే ఒక మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బొంబాయి జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్, బరోడా కళాభవన్‌లలో చదువుకున్నారు. ఆయన డ్రాయింగ్, ఫొటోగ్రఫీ, లిథోగ్రఫీ, డ్రామా కళను అభ్యసించి, తరువాత లోనావాలా లోని రాజా రవి వర్మ ప్రెస్‌లో చేరారు. మేజిక్ కూడా నేర్చుకున్నారు. సహజంగానే పారిశ్రామికవేత్త లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఫాల్కే బొంబాయిలో సొంతంగా ఒక ప్రెస్‌ను ప్రారంభించారు. అందులో ఆయన క్రోమోలితోగ్రాఫ్ లను తయారు చేస్తూ బొమ్మల పుస్తకాలను అచ్చువేసేవారు.
తరువాత అదే ఆయన తీయబోయే పౌరాణిక చిత్రాలకు అలంబన అయింది. 1910లో ఆయన ‘ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ అనే చిత్రాన్ని చూశారు. అది తనపై చూపిన ప్రభావం గురించి 1917లో ఆయన ఇలా రాశారు. ‘‘నేను ఇంతకు ముందు అనేక చిత్రాలు చూశాను. కానీ నేను క్రిస్మస్ రోజున చూసిన ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ చిత్రం మాత్రం నా జీవితంలో విప్లవాత్మకమైన మలుపు తిప్పింది. నేను ఆ సినిమా చూస్తున్నంత సేపూ నా కళ్ల ముందు క్రైస్ట్ స్థానంలో రాముడు, కృష్ణుడు మెదిలారు. ఇలా వెండి తెరపై మన హిందూ దేవుళ్లను దర్శించగలుగుతామా అనిపించింది’’.. అని. సినిమాటోగ్రఫీ చదివిన తరువాత ఫాల్కే సినిమా నిర్మాణానికి సంబంధించిన పరికరాలను కొనడానికి, చిత్ర నిర్మాణం గురించి నేర్చుకునేందుకు ఇంగ్లండ్ వెళ్లారు.
బొంబాయికి తిరిగి వచ్చిన వెంటనే ఫాల్కే ఫిలిమ్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి 1913 నాటికి మొట్ట మొదటి భారతీయ కథా చిత్రంగా ‘రాజా హరిశ్చంద్ర’ను నిర్మించారు. 1917లో ఆయన తీసిన లంకా దహన్ అఖండ విజయం సాధించడంతో పలువురు భారతీయ పురాణ గాథలతో చిత్రాలను నిర్మించారు. అయితే, 1919లో ఫాల్కే రూపొందించిన ‘కాళీ మర్దనం’ స్పెషల్ ఎఫెక్టులతో ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంది.
కాళీయుడిని బ్రిటిష్ పాలకులుగా భావిస్తూ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూశారు. 20 వ శతాబ్దానికల్లా సినిమా అనే దృశ్య కళారనూపం భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు. భారతీయ సినిమా రంగంలో సుదీర్ఘ సేవలు అందించిన ప్రముఖులను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించడం ద్వారా ప్రభుత్వం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేసింది. ఈ అవార్డును భారత రత్నతో సమానమైనదిగా పరిగణిస్తారు.
– సురేశ్ చబ్రియా, సినిమా చరిత్రకారుల
Comments
Please login to add a commentAdd a comment