![Azadi Ka Amrit Mahotsav: History About Town Land Ceiling Act India - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/30/Untitled-5.jpg.webp?itok=naBZIv1E)
ఇందిరాగాంధీ ప్రభుత్వంలో గృహ నిర్మాణ మంత్రి హోదాలో ఇందర్ కుమార్ గుజ్రాల్ పట్టణ భారతంలో ఇళ్ల స్థలాల ధరలను తగ్గించి, భూముల లభ్యతను పెంచాలనే ఉదాత్త ఆశయంతో పట్టణ భూ పరిమితి, నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1997లో యునైటెడ్ ఫ్రంట్ ప్రధానమంత్రి హోదాలో అదే ఐ.కె. గుజ్రాల్ ఆ చట్టాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు! అప్పుడు కూడా ఆయన ఆశయం పట్టణ భారతంలో ఇళ్ల స్థలాలను తగ్గించి, భూముల లభ్యతను పెంచడమే!
ఏ లక్ష్యంతోనైతే పార్లమెంటు ఒక చట్టం చేసిందో సరిగ్గా అదే లక్ష్యాన్ని నెరవేర్చడానికి తిరిగి అదే చట్టాన్ని రద్దు చేయడం అనేది అరుదుగా జరిగే ఘటన. పార్లమెంటు చట్టం విఫలం కావడమే దీనికి కారణం. అన్ని సోషలిస్టు స్వప్నాల్లానే పట్టణ భూమి సామాజికీకరణ కల కూడా భగ్నం అయింది. పట్టణ భూ పరిమితి చట్టం అమలైన 64 నగరాలలో ప్రైవేటు యజమానుల నుంచి 2,20,000 హెక్టార్ల మిగులు పట్టణ భూములను ప్రభుత్వం సేకరించవలసి ఉంది.
ఆ భూమిలో అత్యధిక భాగాన్ని పేదలకు ఇళ్లు కట్టడానికి వినియోగించవలసి ఉంది. కానీ వాస్తవంలో 19,000 హెక్టార్ల పట్టణ భూములను మాత్రమే సేకరించారు. అయితే, పట్టణ భూ పరిమితి చట్టం, అద్దె నియంత్రణ చట్టం, అధిక స్టాంప్ సుంకాల వల్ల కృత్రిమ భూ కొరత ఏర్పడి ముంబైలో భూముల ధరలు న్యూయార్క్, లండన్ ధరలను మించిపోయాయి. చాలా రాష్ట్రాల్లో పట్టణ భూపరిమితి చట్టాన్ని రద్దు చేశారు. దాంతో కనీసం ఒక తరం పట్టణ భారతీయులకు సొంత ఇల్లు అనేది కలగానే మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment