
వలస ఒప్పంద కూలీలైన ‘గిరిమిటియా’లను ఆ చెర నుంచి విడిపించడం కోసం దక్షిణాఫ్రికాలోనే ఉండిపోయిన లాయర్ గాంధీ.. ఆ పని సాధించాకే తిరిగి ఇండియా వచ్చారు.
గాంధీజీ భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎంతటి పోరాటం చేశారో అంతటి పోరాటం దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల పరిరక్షణ కోసం చేశారు. 1893 మే నెలలో న్యాయవాదిగా వృత్తి ధర్మంతో దక్షిణాఫ్రికాలో ప్రవేశించారు గాంధీ. ఆ పని సంవత్సరంలో అయిపోయింది. 1894లో స్వదేశానికి తిరిగి రావలసి వుంది కానీ ఆ దేశంలో వారు ఒక బిల్లు ప్రవేశపెట్టారు.
ఆ బిల్లు వలన కలిగే నష్టాలేమిటో అక్కడి మన భారతీయులకు వివరించడానికి గాంధీజీ ఆగిపోయారు. అలా గాంధీజీ బిల్లు గురించి చెప్పేసరికి వారంతా గాంధీజీని అక్కడే (దక్షిణాఫ్రికాలో) ఉండిపోయి తమ కష్టాలను నివారించమని కోరారు. దాంతో గాంధీజీ అక్కడే 21 సంవత్సరాలు.. అంటే 1914 వరకూ ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయన ప్రధానంగా గిరిమిటియాల సమస్యను పరిష్కరించాడు. ‘గిరిమిటియా’ అంటే ‘ఒప్పంద వలస కూలీ’ అని బ్రిటిష్ అర్థం.
పద్ధతి రద్దు కాలేదు
ఐదేళ్లు పని చేస్తామని అంగీకరించి ఒప్పందం పత్రంపై సంతకం చేసి భారతదేశాన్ని వదిలి దక్షిణాఫ్రికాకు ఉపాధి కోసం వెళ్లిన వారిని గిరిమిటియాలు అంటారు. అటువంటి గిరిమిటియాలకు 1914లో విధించిన 3 పౌండ్ల పన్ను రద్దు అయినప్పటికీ, ఆ విధానం మాత్రం పూర్తిగా రద్దు కాలేదు. (1916లో మదన్ మోహన్ మాలవ్య పెద్దల కౌన్సిల్‌లో ఈ విషయాన్ని లేవనెత్తారు.
దీనికి సమాధానంగా లార్డ్ హార్డింగ్ తగిన సమయం వచ్చినప్పుడు ఆపుతామని అన్నారు.) గాంధీజీ 1893లో దక్షిణాఫ్రికా వెళ్లే నాటికి ఆ దేశం నాలుగు కాలనీల సమూహం. నేటాల్, కేఫ్, ట్రాన్స్ వాల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్. డచ్చి వారు (బోయర్స్) ట్రాన్స్ వాల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్‌లోనూ, బ్రిటిష్ వారు నేటాల్, కేఫ్ ప్రాంతాల్లోనూ ఉండేవారు. వీరు నిరంతరం సంఘర్షించుకుంటూనే ఉండేవారు. చివరకు బోయర్స్ వార్‌తో దక్షిణాఫ్రికా యావత్తూ బ్రిటిష్ వారి వశమయ్యింది. అయితే భారతీయుల న్యాయపరమైన హక్కుల రక్షణకే ఈ యుద్ధం చేశామని బ్రిటిష్ వారు చెబుతూ వచ్చారు.
ఇష్టమైతే మరో ఐదేళ్లు
దక్షిణాఫ్రికాలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, ఖనిజ సంపద, వజ్రాలు పైకి తీయడానికి శ్వేత జాతీయులకు భారతీయ కూలీల సహాయం విధిగా కావాలి. కనుక భారతీయ కూలీలను కాంట్రాక్టు పద్ధతిమీద దక్షిణాఫ్రికా పంపడానికి ఇండియాలోని బ్రిటిష్ పాలకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అటువంటి కాంట్రాక్టు కూలీల జట్టు ఒకటి 1860లో దక్షిణాఫ్రికా చేరింది.
కాంట్రాక్టు కాల పరిమితి ముగియడంతోనే వారికి ఇష్టమయితే మరో అయిదు సంవత్సరాల పాటు తిరిగి కూలీలుగా కాంట్రాక్టు లో చేరవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణానికయ్యే ఖర్చుకు ఎంత భూమి లభిస్తుందో అంత భూమిని వారికే కేటాయిస్తారు. ఆ భూమిలో స్థిరపడి వారు అక్కడే సేద్యం చేసుకోవచ్చు. అలా స్థిరపడిన వారి అవసరాలు తీర్చడానికి అచిరకాలంలోనే భారతీయ వర్తకులు కూడా అక్కడ ప్రవేశించారు. ఆ విధంగా దక్షిణాఫ్రికాలో భారతీయ జనాభా పెరిగింది.
అవసరం కోసం ఆసరా!
1969లో ఇంకా కూలీలను ఎగుమతి చేయాల్సి వచ్చినప్పుడు ‘కూలీ కాంట్రాక్టు కాల పరిమితి అయిపోవడంతోనే వారు ఆ దేశంలోని సాధారణ చట్టాలను అనుసరించి జీవించడానికి వీలుండాలనీ, ఏ విధమైన నిర్బంధాలు ఉండకూడదని’ బ్రిటన్ స్పష్టం చేసింది. 1858లో విక్టోరియా రాణి ప్రకటనలో కూడా ‘‘మన ఇతర దేశాల ప్రజల వలనే భారతీయులకు కూడా సమాన హక్కులుంటాయి’’అని హామీ ఇచ్చారు. భారతీయ వర్తకులు చౌకగా జీవించగలిగేవారు. అందువల్ల బ్రిటిష్ డచ్ వర్తకులకన్నా తక్కువ ధరకు సరుకులు అమ్మగలిగేవారు. దాంతో భారతీయ వర్తకులు యూరోపియన్ వర్తకులకు బాగా పోటీగా వున్నారని వారు గ్రహించారు. భారతీయ వ్యవసాయదారులు కొత్త రకాలైన కాయలను, పండ్లనూ, చౌకగానూ, విస్తారంగానూ పండించడం మొదలుపెట్టారు.
అలా భారతీయుల్ని స్వేచ్ఛగా తమ దేశంలోనికి రానిచ్చినట్లయితే వారు వ్యవసాయంలోనూ, వ్యాపారం లోనూ తెల్లవారిని తుడిచి పెట్టేస్తారేమోనని వారు భయపడ్డారు. అందువల్ల భారతీయులపై అనేక ఆంక్షలను విధించడం ప్రారంభించారు. 1885 లో 3 వ నెంబరు చట్టాన్ని ట్రాన్స్ వాల్ లో ప్రవేశపెట్టారు. ఆసియా వాసులు.. ముఖ్యంగా భారతీయులు పారిశుధ్య కారణాల వల్ల వారికి ప్రత్యేకించబడిన ప్రాంతాలలోనే నివసించాలనీ, కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో తప్ప స్థిరాస్తులను సంపాదించుకోకూడదని, వ్యాపారనిమిత్తం వచ్చేవారు లైసెన్సు పొంది రిజిస్టర్ చేయించుకుని రావాలని శాసించింది ప్రభుత్వం.
ఆ తరువాత దక్షిణాఫ్రికా అంతటా భారతీయుల మీద జాతి విద్వేషం, రైళ్లలోనూ, బస్సుల్లోనూ, స్కూళ్లలోనూ, హోటళ్లలోనూ అపారంగా పెరిగిపోయింది. పర్మిట్ లేకుండా భారతీయులను ఒక కాలనీ నుంచి మరో కాలనీకి పోనివ్వలేదు. భారతీయుల సంఖ్య హెచ్చుగా వున్న ‘నేతాల్‘ లో భారతీయుల ఓటు హక్కును రద్దు చేశారు.
ఆ క్రమంలో గాంధీజీ ఓడలో దక్షిణాఫ్రికాలోని టయోటా రేవుకు చేరారు. ఓడ దిగక ముందే.. ‘మీరు తిరిగి వెళ్లిపోండి లేకపోతే సముద్రంలో ముంచేస్తాం, తిరిగి వెళ్లిపోతే మీకు అయిన ఖర్చులన్నీ ఇచ్చివేస్తాం‘ అని ఓడ ప్రయాణికులను అక్కడివారు హెచ్చరించారు.
చివరకు పోలీసు వారి సహాయంతో ఓడ దిగగానే గాంధీజీ పై రాళ్ల దాడి జరిగింది. ఎలానో గాంధీజీ ని పోలీసులు ఇంటికి చేర్చారు. స్థానికులు గాంధీజీ ఇంటి ముందు చేరి ‘గాంధీ ని మాకు అప్పగించండి’ అని గొడవ చేశారు. ప్రిటోరియా లో గాంధీజీకి క్షవరం చేయడానికి క్షురకుడు కూడా నిరాకరించాడు. ఆ విధంగా న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో భారతీయుల కష్టాలను నివారించడానికి గాంధీజీ 21 సంవత్సరాలు పోరాటం చేయాల్సివచ్చింది. ఆ పోరాటం వల్లనే గిరిమిటియా సమస్య కూడా పరిష్కారమయ్యింది. 1914 లో గాంధీజీ భారత్‌కు తిరిగి వచ్చి అకుంఠిత దీక్షతో దక్షిణాఫ్రికా పోరాట అనుభవంతో భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని 1947 లో భారత్ కు స్వాతంత్య్రాన్ని తీసుకురాగలిగారు.
– డా. కాశింశెట్టి సత్యనారాయణ,విశ్రాంత ఆచార్యులు
(చదవండి: సమర యోధుడు: అనుగ్రహ నారాయణ్ సిన్హా)
Comments
Please login to add a commentAdd a comment