దేశంలో ఎంతగా సంపన్నులు ఉన్నారో, అంతగా పేదలూ ఉన్నారు. అంటే దీనర్థం రాజూ పేద సమాన సంఖ్యలో ఉన్నారని కాదు. అమెరికా, చైనాల తర్వాత భారత్‌లోనే ఎక్కువ మంది శత కోటీశ్వరులు ఉన్నట్లుగా, ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యంత పేదరికం అనుభవిస్తున్న వారు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు.
ఏది ఎలా ఉన్నా.. స్వాతంత్య్రానంతరం ఆర్థికపరమైన ఈ అసమానతలు క్రమంగా పెరుగుతూ ఉండటమే ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆర్థిక స్థిరత్వంతో పాటే అసమానతలూ తగ్గించడానికి భారత్ ప్రయత్నిస్తున్న మాటైతే కాదనలేనిది. ఇటీవలి కాలంలో భారత్‌లో ఆర్థిక అసమానతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
1947 తర్వాతి కాలంలో ఆర్థిక సామాజిక రంగాలలో పేదరికం తగ్గిన మాట వాస్తవమే అయినా.. ధనికులు మరింత ధనికులు కావడం, పేదలు మరింతగా పేదరికానికి చేరుకోవడం అన్నదీ కాదన లేని సత్యం. ఇదంతా ఎలా జరుగుతుందో చూడండి. అభివృద్ధి ప్రారంభ దశల్లో కొత్తగా వచ్చే అవకాశాలను ఉపయోగించుకుని లబ్ది పొందడం ధనవంతులకే సాధ్యం అవుతుంది.
మరోవైపు, నైపుణ్యం లేని కార్మికులు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల వారి వేతనాలలో కోత పడి అసమానతలు పెరుగుతాయి. వచ్చే ఇరవై ఐదేళ్లలో ఒక విధానంగా అసమానతల్ని తగ్గించుకుంటూ పోతే కనుక.. భారత్‌లోని పేదరికం తగ్గుముఖం పడుతుంది. అందుబాటులో ఉన్న తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న వారు 69 కోట్ల మంది. వారిలో 20 శాతానికి పైగా భారత్‌లోనే ఉన్నారు!
Comments
Please login to add a commentAdd a comment