
కులాల గణన చేయాలని దేశంలో ఇటీవల మళ్లీ గళాలు వినిపిస్తున్నాయి. కుల గణన వల్ల సంక్షేమ ఫలాలు సమాజంలో సక్రమంగా పంపిణీ అవుతాయని, సామాజిక న్యాయం చేకురుతుందనీ ఒక వాదన ఉంది. ఆ వాదనలో వాస్తవం ఉండొచ్చు. కానీ బ్రిటిష్ వాళ్లు చేసిన ఈ తరహా గణన వల్ల ప్రయోజనం లేకపోగా ప్రజల్లో విభేదాలు ఏర్పడ్డాయి. స్వాతంత్య్రం వచ్చాక ఈ భేద భావనలు, అసమానతలు తగ్గుతాయని అనుకున్నా అవి మరింతగా ఎక్కువయ్యాయి.
ఒక సామాజిక సమతుల్యతను తెచ్చేందుకు 1974లో జయప్రకాశ్ నారాయణ్ నవ నిర్మాణ్ ఉద్యమాన్ని లేవనెత్తారు. తర్వాత 1977లో దేశంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం సామాజిక న్యాయ సాధనకు 1979తో మండల్ కమిషన్‌ను నియమించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలో 27 శాతం ఉద్యోగాలను ‘ఇతర వెనుకబడిన కులాలలకు’ కేటాయించాలని ఆ కమిషన్ సిఫారసు చేసింది. కమిషన్ 1980లో నివేదిక సమర్పించింది.
ఆ తర్వాత పదేళ్లకు గానీ నివేదిక అమలుకు నోచుకోలేదు. 1990లో ప్రధానిగా ఉన్న వీపీ సింగ్.. కమిషన్ సిఫారసులను అమలు చేస్తున్నట్లు ప్రకటించగానే దేశం భగ్గుమంది. తర్వాతి పరిణామాలన్నీ తెలిసినవే. సామాజిక న్యాయం ఎప్పటికైనా సాధ్యపడుతుందా అనే సందేహాలే మిగిలాయి. సామాజిక న్యాయం అన్నది ప్రజాస్వామ్య చట్రంలోనే సాధ్యం అవుతుంది. ఆ విశ్వాసంతో 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం ప్రణాళికలను రూపొందించి, చట్ట రూపంలోకి తెస్తే తప్పక అసమానతలను నివారించవచ్చని సామాజిక ధోరణుల అధ్యయనవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు.