Azadi Ka Amrit Mahotsav: Kerala Tribal Chief Thalakkal Chandu Life History In Telugu - Sakshi
Sakshi News home page

Thalakkal Chandu History: తలక్కల్‌ చందు తలవంచిందేలే!

Published Sun, Jul 10 2022 3:32 PM | Last Updated on Tue, Jul 12 2022 1:38 PM

Azadi Ka Amrit Mahotsav Thalakkal Chandu Traibal Chief Of Kerala - Sakshi

కేరళ ఆదివాసీ వీరుడు తలక్కల్‌ చందు గొరిల్లా యుద్ధ రీతులతో బ్రిటీషర్లను గజగజలాడించాడు. పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్ధంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే మలబారు తీరంలో మిరియాల వర్తకంపై ఏకఛత్రాధిపత్యం సాధించాలన్న కంపెనీ ప్రయత్నాలకు కేరళ ఆదివాసీ వీరులు అడ్డుగా నిలిచారు. ఈ వీరులకు పోరాటాల్లో కేరళ కొట్టాయంకు చెందిన వీర కేరళ వర్మ పళాసీ రాజా సాయం చేశారు. రాజా సాయంతో స్థానిక ఆదివాసీ వీరుడు తలక్కల్‌ చందు గొరిల్లా యుద్ధ రీతులతో బ్రిటీషర్లను గజగజలాడించాడు. 

1779–1805 కాలంలో వయనాడ్‌లోని కురిచియ సైన్యాన్ని కంపెనీకి వ్యతిరేకంగా ఆయన ముందుండి నడిపించారు. కేరళ మనంతవాడికి చెందిన కక్కొట్టిల్‌ కురిచయ తరవాడ్‌ (కురిచయల ఉమ్మడి కుటుంబం)లో చందు కీలక సభ్యుడు. ఈ కుటుంబానికి పళాసీ ఎడచన నాయర్‌ కుటుంబంతో చాలా అనుబంధం ఉండేది. కురిచయ తెగ ప్రజలు వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడేవారు. వయనాడ్‌ ప్రాంతంలో వరి సాగులో వీరు ముందంజలో ఉండేవారు.

పన్నుల భారం
మలబార్‌ రెవెన్యూ సెటిల్‌మెంట్‌కు మేజర్‌ విలియం మాక్‌లీడ్‌ పన్ను కలెక్టర్‌గా పనిచేసిన కాలం మలబార్‌ ప్రాంత రైతాంగానికి పీడకలలా మారింది. ముఖ్యంగా వయనాడ్‌ ఆదివాసీ రైతులను పన్నుల పేరిట విలియం పలు ఇక్కట్లు పెట్టాడు. మేజర్‌ కింద పనిచేసే అవినీతి అధికారులు అసంబద్ధ రెవెన్యూ సర్వేలు చేసేవారు. చివరకు ఒక్కో వ్యక్తి బంగారం రూపంలో చెల్లించాల్సిన పన్నులను 20 శాతం పెంచాడు విలియం.

అలాగే వరి ఉత్పత్తిపై పన్ను 40 శాతం వరకు పెంచారు. వీటి వసూలు కోసం బ్రిటీష్‌ పోలీసులు, రెవెన్యూ అధికారులు కురిచియ తెగ నివాసాలపై దాడులు చేసేవారు. దాడుల సమయంలో అమాయక ఆదివాసీలను అవమానించడం, అణగదొక్కడం జరిగేది. ఇవన్నీ చూసిన చందు తన ప్రజల్లో విప్లవాగ్ని రగిలించాడు. వరి సాగుతో పాటు పోరాట అవసరాన్ని వివరించాడు. దీంతో వయనాడ్‌ ప్రాంత ఆదివాసీలు చందు నాయకత్వంలో సంఘటితమయ్యారు.

మిలీషియా దాడి
మేజర్‌ విలియం అకృత్యాలకు ప్రతిఘటనగా చందు నాయకత్వంతో దాదాపు 150 మంది కురిచయ మిలిషీయా 1802 అక్టోబర్‌ 11న వయనాడ్‌లోని పనమరం బ్రిటీష్‌ క్యాంపుపై దాడి చేసింది. ఆ సమయంలో క్యాంపులో 70 మంది సైనికులున్నారు. వీరంతా బొంబాయి ఇన్‌ఫ్యాంటరీకి చెందిన కెప్టెన్‌  డికెన్‌సన్‌ , లెఫ్టినెంట్‌ మాక్స్‌వెల్‌ ఆధ్వర్యంలో పనిచేసేవారు. కురిచయ ప్రజలను అవమానించడంలో వీరిది అందెవేసిన చేయి.

అందుకే తొలిదాడికి ఈ క్యాంపును చందు ఎంచుకున్నాడు. కెప్టెన్‌ , లెఫ్టినెంట్‌ సహా ఏ ఒక్క సైనికుడిని మిగల్చకుండా కురిచయ సైనికులు హతమార్చారు. క్యాంపు నుంచి 112 తుపాకులు, ఆరు పెట్టెల మందుగుండు, రూ. 6వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. క్యాంపులో నిర్మాణాలన్నీ తగలబెట్టి కంటోన్మెంట్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో కురిచయల సైన్యంలో ఐదుగురు మరణించారు. ఈ దాడి దక్షిణ భారతంలో బ్రిటీషర్లకు తీవ్ర దిగ్భ్రమను కలిగించింది.

కంపెనీకి అవమానం
పనమరం దాడికి ప్రతీకారం కోసం బ్రిటీష్‌ సైన్యం దాదాపు మూడేళ్లు యత్నించింది. చందు సహా కురిచయన్‌  యోధులను బంధించాలని, తద్వారా పళాసీ రాజాను అదుపులోకి తీసుకోవాలని విపరీతంగా శ్రమించింది. అయితే కురిచయల గొరిల్లా పోరాట రీతులముందు బ్రిటీషర్ల ప్రయత్నాలు ఫలించలేదు. వీరంతా పులపల్లి సమీపంలోని సీతాదేవీ ఆలయంలో తలదాచుకొనేవారు.

ఎలాగైనా వయనాడ్‌ను బ్రిటీషర్ల నుంచి విముక్తి చెందించి పళాసీ రాజాను గద్దెనెక్కించాలని కురిచయలు ప్రతినబూనారు. వీరి పోరాటాలను తట్టుకోలేని కంపెనీ ప్రభుత్వం 1803లో ఆ ప్రాంతమంతా మార్షల్‌ లా విధించింది. అయితే ఎవరూ ఈ చట్టానికి తలవంచకపోవడం, స్థానికులంతా బ్రిటీషర్లను ఎదరించడం వంటివి కంపెనీకి మరింత అవమానం మిగిల్చాయి. చివరకు ఆంగ్లో మరాఠా యుద్ధంలో వీరుడిగా పేరుగాంచిన ఆర్థర్‌ వెల్లెస్లీ సైతం కురిచయల చేతిలో ఓటమిని చవిచూశాడు. 

పట్టించిన నమ్మకద్రోహం
ఎదురుదెబ్బలు తగిలిన చోట కుట్రలు పన్నడం బ్రిటీషర్లకు వెన్నతో పెట్టిన విద్య! చందు పోరాటాన్ని తట్టుకోలేని కంపెనీ చివరకు కుట్రలకు దిగింది. కురిచయల, చందు ఆచూకీ తెలిపినవారికి ధనం, భూమి ఇస్తామని ఆశపెట్టడంతో స్థానికుల్లో కొందరు నమ్మక ద్రోహానికి దిగారు. 1805 నవంబర్‌ 14న జరిగిన భీకర యుద్దంలో స్థానికుల కుట్ర కారణంగా చందు కంపెనీ చేతికి చిక్కాడు.

పట్టుబడిన చందును పనమరం కోటకు తెచ్చి దాదాపు తీవ్రంగా హింసించి అనంతరం నవంబర్‌ 15న కోలీ చెట్టుకు ప్రజలందరి ముందర ఉరి తీశారు. ఆయన సహచరుడు ఎడచెన కుంకన్‌ బ్రిటీషర్ల చేతికి చిక్కకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. చందు పోరాటం కేరళలో పలు స్వాతంత్య్రోద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. 2012లో కేరళ ప్రభుత్వం పనమరం కోటలో చందు పేరిట మ్యూజియంను, స్మారకచిహ్నాన్ని నెలకొల్పింది. ఈ మ్యూజియంలో చందు, ఆయన తోటి వీరులు వాడిన విల్లంబులు ఇతర ఆయుధాలతో పాటు నాటి సాంప్రదాయక వ్యవసాయ సామగ్రిని ప్రదర్శనకు ఉంచారు. 
–  దుర్గరాజు శాయి ప్రమోద్‌  

(చదవండి: జైహింద్‌ స్పెషల్‌: ఉద్వేగాలను దట్టించి.. కథల్ని ముట్టించారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement