జమ్ముకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతోంది. అయితే తాజాగా భక్తులను నిరాశపరిచే ఒక వార్త వినిపిస్తోంది. అమర్‌నాథ్ గుహలో అంతకంతకూ పెరుగుతున్న వేడి కారణంగా మంచు శివలింగం అకాలంగా కరిగిపోయింది. దీంతో భక్తులు మహా శివలింగాన్ని దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
గుహలో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా ఈరోజు(శనివారం) అమర్‌నాథ్ యాత్ర బల్తాల్, పహల్గాం రెండు మార్గాలలోనూ వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన వెంటనే యాత్ర ప్రారంభం కానున్నదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే తాజాగా పవిత్ర గుహలోని మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడంతో యాత్రికులు నిరాశకు గురయ్యారు.
గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మంచు కరిగే ప్రక్రియ వేగవంతమైందని అధికారులు చెబుతున్నారు. యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోనే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడం 2008 తర్వాత ఇప్పుడే చోటుచేసుకుంది. ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర 52 రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment