melts
-
అమర్నాథ్ యాత్ర: కరిగిన మంచు శివలింగం.. భక్తుల నిరాశ
జమ్ముకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. అయితే తాజాగా భక్తులను నిరాశపరిచే ఒక వార్త వినిపిస్తోంది. అమర్నాథ్ గుహలో అంతకంతకూ పెరుగుతున్న వేడి కారణంగా మంచు శివలింగం అకాలంగా కరిగిపోయింది. దీంతో భక్తులు మహా శివలింగాన్ని దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గుహలో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా ఈరోజు(శనివారం) అమర్నాథ్ యాత్ర బల్తాల్, పహల్గాం రెండు మార్గాలలోనూ వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన వెంటనే యాత్ర ప్రారంభం కానున్నదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా భక్తులు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే తాజాగా పవిత్ర గుహలోని మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడంతో యాత్రికులు నిరాశకు గురయ్యారు.గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మంచు కరిగే ప్రక్రియ వేగవంతమైందని అధికారులు చెబుతున్నారు. యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోనే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడం 2008 తర్వాత ఇప్పుడే చోటుచేసుకుంది. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర 52 రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. -
ఇంగ్లండ్‌లో ఎండ దెబ్బకు కరిగిన రన్‌వే
లండన్: ఇంగ్లాండ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వాహనాలకు నిప్పంటుకుంటోంది. గడ్డి భూములు అగ్నికి ఆహూతవుతున్నాయి. రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎండలను తట్టుకోలేక ప్రజలు బీచ్‌లకు పరుగులు తీస్తున్నారు. ఈత కొలన్లలో సేదతీరుతున్నారు. ఎండ దెబ్బకు లూటన్ ఎయిర్‌పోర్టులో రన్‌వే కరిగిపోయింది! దాంతో విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది. సోమవారం కేంబ్రిడ్జ్‌లో 38 డిగ్రీలు, లండన్‌లో 37.5 డిగ్రీలు నమోదైంది! సూర్యప్రతాపం వల్ల అడవుల్లో కార్చిచ్చు రగులుతోంది. లండన్‌లోని వాక్స్హాల్ ప్రాంతంలో రైలు పట్టాలు వ్యాకోచించి, వంగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. లండన్‌లో వుడ్గ్రీన్ క్రౌన్ కోర్టులో ఏసీ యూనిట్ పేలిపోవడంతో ఓ మర్డర్ కేసులో విచారణను వాయిదా వేశారు. యూకేలో వాతావరణం సహారా ఎడారిని తలపిస్తోందంటూ జనం సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే ప్రమాదముందన్న హెచ్చరికలు ఇంకా భయపెడుతున్నాయి. -
బ్లడ్ క్యాన్సర్‌ను నయంచేసే అద్భుత మాత్ర
మెల్బోర్న్: అత్యంత ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్ (లింఫోటిక్ లుకేమియా) నయం చేయడానికి అద్భుతమైన మాత్ర త్వరలోనే ప్రపంచ మార్కెట్లోకి రానుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వున్న ‘వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ సంస్థ ఈ అద్భుతమైన మాత్రను రూపొందించి దానికి వెనెటోక్లాక్స్ అని పేరు పెట్టింది. ఈ మాత్రను డోసేజ్ ప్రకారం వాడడం వల్ల క్యాన్సర్ కణాలు కరగిపోతాయి. వాస్తవానికి ఈ మందును మెల్బోర్న్ సంస్థ 1980 దశకంలోనే కనిపెట్టింది. ముందుగా జంతువులపై ప్రయోగాలు జరిపి, అనంతరం క్యాన్సర్ రోగులపై కూడా ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించడానికి ఇంతకాలం పట్టింది. క్యాన్సర్ కణాలను ప్రోత్సహించే ‘బీసీఎల్ 2’ ప్రోటీన్‌ను నాశనం చేయడం త్వారా తమ డ్రగ్ క్యాన్సర్ కణాలను కరగిపోయేలా చేస్తుందని సంస్థకు చెందిన నిపుణులు తెలిపారు. ఎలాంటి మందులతో కూడా క్యాన్సర్ నయంకాని లింపోటిక్ లుకేమియాతో బాధపడుతున్న 116 మంది రోగులను తాము ఎంపికచేసుకొని వారికి వెనెటోక్లాక్స్ మాత్రలను రెండేళ్లపాటు ఇచ్చి చూశామని, దాదాపు 80 శాతం మందికి క్యాన్సర్ తగ్గిపోయిందని పరిశోధకులు వెల్లడించారు. వారిలో ఎక్కువ మందికి బ్లడ్ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోగా కొంత మందిలో ఎక్కువ మందికి తగ్గిపోయిందని, వారందిరిలోనూ జీవితకాలం పెరిగిందని వారు వివరించారు. ‘నేను ఎన్నో మందులు వాడి చూశాను. దేనీకి నా క్యాన్సర్ జబ్బు నయం కాలేదు. రోజుకు 20 గంటలపాటు పడక మీదనే పడుకొని ఉండేవాడిని. ఏ పని చేయడానికి శక్తి ఉండేది కాదు. గత రెండేళ్లుగా వెనెటోక్లాక్స్ మాత్రలను వాడాను. ఇప్పుడు పూర్తిగా క్యాన్సర్ నయం అయింది. ఇప్పుడు నేను నా వయస్సుకు తగ్గ ఏ పనైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని మెల్బోర్న్ రాయల్ ఆస్పత్రిలో పూర్తిగా కోలుకున్న 68 ఏళ్ల విక్ బ్యాక్‌వుడ్ మీడియాతో చెప్పారు. ఈ డ్రగ్‌ను త్వరలో అమెరికా మార్కెట్లోకి విడుదల చేసేందుకు ‘అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ మంగళవారం నాడు అనుమతి మంజూరు చేసింది.