ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, దివంగత నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ శుక్రవారం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీలో చేరారు. అజిత్ పవార్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా జీషన్ మాట్లాడుతూ.. ఇది తనకు, తన కుటుంబానికి ఉద్వేగభరితమైన క్షణం అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయాల్లో తనును నమ్మినందుకు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానమైన వాంద్రే ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడి నుంచే నామినేషన్ వేసి ప్రజలందరి ప్రేమ, మద్దతుతో మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కాగా 2019 ఎన్నికల్లో వాంద్రే ఈస్ట్ నుంచి గెలుపొందిన 32 ఏళ్ల జీషన్ సిద్దిఖీ.. గత ఆగస్టులో మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ మహరాష్ట్ర మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాంద్రే సిట్టింగ్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్.. శివసేన (యూబీటీ) ఉద్దవ్ ఠ్రాకేకు అప్పగించింది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే అసమ్మతి వ్యక్తం చేస్తూ జీషన్.. ఎన్సీపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment