సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ రాబోయే రోజుల్లో జాతీయ గీతం, జాతీయ జెండానూ మార్చాలంటారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చాలని యత్నించి భంగపాటుకు గురైన మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఎలాంటి గతి పట్టిందో.. కేసీఆర్‌కూ అదే గతి పట్టడం తథ్యమని జోస్యం చెప్పారు. నిజాంను తన్ని తరిమిన చరిత్ర ఉన్న తెలంగాణలో అదే తీరులో కేసీఆర్‌ను ప్రజలు తన్ని తరిమే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం తెలంగాణభవన్‌లో అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన ‘బీజేపీ భీమ్ దీక్ష’లో ఎంపీలు సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు, కర్ణాటక ఎంపీ మునిస్వామి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, వెదిరె శ్రీరాం, కామర్సు బాలసుబ్రహ్మణ్యం సహా పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకుంటున్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం స్థానంలో తన విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని, భవిష్యత్తులో అంబేడ్కర్ స్థానంలో తన వర్ధంతులు జరపాలని కేసీఆర్ కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ తన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వెనక్కి తగ్గబోమని, అంబేడ్కర్ స్ఫూర్తితోనే కేంద్రంలో మోదీ పాలన సాగుతోందన్నారు. తెలంగాణ గీతాన్ని కూడా తిరిగి రాయాలని కేసీఆర్ కోరినప్పుడు రచయిత అందెశ్రీ కేసీఆర్‌కు చివాట్లు పెట్టారని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న కేసీఆర్ సీఎం పదవిలో కూర్చొనేందుకు అర్హుడు కాదని మండిపడ్డారు. కేసీఆర్ జైలుకు పోకుండా ఉండేందుకు రాజ్యాంగాన్ని మార్చి రాయాలా? అని ఎంపీ బాపూరావ్ ప్రశ్నించారు. ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు, హక్కులు ఇవ్వడం కేసీఆర్‌కు ఇష్టం లేదా? అని నిలదీశారు. 60 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు రాజ్యాంగం సరిగా అర్థం కాలేదని విమర్శించారు.
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ‘బీజేపీ భీమ్ దీక్షలు’నిర్వహించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన దీక్షలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. రాజ్యాంగంలోని మూడవ అధికరణం కారణంగా పాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్న విషయాన్ని కేసీఆర్ మరిచిపోవడం క్షంతవ్యం కాదన్నారు. పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ల కింద ఎంత ఖర్చుచేశారో కేసీఆర్ ప్రకటించాలన్నారు. ఈ దీక్షలో పార్టీ నేతలు రాజా సింగ్, ఏపీ జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎస్.కుమార్, రవీంద్ర నాయక్, డా.ఎ.చంద్రశేఖర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌కు అర్హత లేదు: ఈటల
హుజూరాబాద్: భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి.. మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంటలో నిర్వహించిన భీమ్ దీక్షలో ఆయన మాట్లాడారు. సీఎం, ఆయన అనుచరులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లుగా కేసీఆర్ ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో చూస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment