బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేడు నిందితులను బెంగళూరు క్రైమ్ బ్యాంచ్ పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని హేమ పోలీసులకు లేఖ రాశారు.
ఈ లేఖలో హేమ.. ఈ కేసులో తాను హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే, హేమ లేఖను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్‌లో తేలింది. దీంతో, వారంతా ఈరోజు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. అయితే రేవ్ పార్టీకి తాను హాజరుకాలేదని వీడియోలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే, వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసులో వాసు ప్రధాన అనుచరుడు చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment