న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తరువాత అక్కడి హిందువులతో సహా ఇతర మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి మైనారిటీలు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా త్రిపురలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బంగ్లాదేశ్‌కు చెందిన 13 ఏళ్ల హిందూ బాలికతో పాటు ఆమె తల్లి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వారిని అడ్డుకునేందుకు బీఎస్‌ఎఫ్ జవానులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ బాలిక మృతిచెందింది.
ఢాకా ట్రిబ్యూన్ తెలిపిన వివరాల ప్రకారం సంఘటన జరిగిన 45 గంటల తర్వాత బీఎస్‌ఎఫ్ ఆ బాలిక మృతదేహాన్ని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కి అప్పగించింది. ఆమెను 13 ఏళ్ల స్వర్ణ దాస్‌గా గుర్తించారు. కాగా చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని బాలిక కుటుంబానికి అప్పగించామని కులౌరా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బినయ్ భూషణ్ రాయ్ తెలిపారు.
త్రిపురలో ఉంటున్న తమ సోదరుడిని కలిసేందుకు స్వర్ణ, ఆమె తల్లి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరికి స్థానిక బ్రోకర్లు సహకారం అందించారు. వారు భారత సరిహద్దుకు చేరుకున్నప్పుడు వారిని వారిస్తూ బీఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్వర్ణ అక్కడికక్కడే మృతిచెందగా ఆమె తల్లి ప్రమదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ విషాద ఘటనపై సరిహద్దు ప్రాంతంలోని ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment