బెంగళూరులో వైఎస్సార్‌కు ఘన నివాళి | Bengaluru: Fans Pay Tribute To YSR On His 11th Death Anniversary | Sakshi
Sakshi News home page

బెంగళూరులో వైఎస్సార్‌కు ఘన నివాళి

Published Wed, Sep 2 2020 6:44 PM | Last Updated on Wed, Sep 2 2020 6:46 PM

Bengaluru: Fans Pay Tribute To YSR On His 11th Death Anniversary - Sakshi

సాక్షి, బెంగళూరు : దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 11వ వర్ధంతి పురస్కరించుకొని ఆయనను బెంగళూరులోని తెలుగు ప్రజలు స్మరించుకున్నారు. ఇడమకంటి లక్ష్మీరెడ్డి  ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ కళామందిరంలో  సంస్మరణ సభ నిర్వహించి వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు కేసీ రామ్మూర్తి, కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, డాక్టర్‌ రాధాకృష్ణరాజు, డాక్టర్‌ బలవీరారెడ్డి, ధనుంజయరెడ్డి, సుదాకర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దివంగత నేత వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ రచించిన  ‘నాలో నాతో వైఎస్సార్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఎంపీ కేసీ రామ్మూర్తి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజకీయక్షేత్రంలో ధీమంత నాయకునిగా చెరగని ముద్రవేసిన వైఎస్సార్‌.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా యావత్ భారతదేశం అనుసరిస్తుందని ప్రశంసించారు.

కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాల వలే తాము ఎమ్మెల్యేలుగా గెలిచామని చెప్పారు. ఆ మహనీయుడు వేసిన బాటే  తమకు మార్గదర్శకమని, ఆయన బాటలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. ఇక సభను ప్రారంభించిన తెలుగు విజ్ఞానసమితి అధ్యక్షుడు డాక్టర్‌ రాధాకృష్ణరాజు మాట్లాడుతూ..భారతదేశ చరిత్రలో స్వయంకృషితో, ప్రతిభతో ఎదిగి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా అయింది కేవలం ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ మాత్రమేనని పేర్కొన్నారు. వైఎస్సార్‌ స్వయం కృషితో ఎదిగారుకాబట్టే.. ఇప్పటికీ ఆయన పేరుతో స్థాపించిన రాజకీయపార్టీ అధికారంలో ఉందని ప్రశంసించారు. వైఎస్సార్‌ తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ప్రతిఫలమే నేడు వైస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

‘నాలో నాతొ వైఎస్సార్‌’ పుస్తకాన్ని సభకు పరిచయం చేసిన  పూర్వ ఉపకులపతి, డాక్టర్ బలవీరారెడ్డి మాట్లాడుతూ.. విజయమ్మ రాసిన పుస్తకం సామాన్యుడిని కూడా వైఎస్సార్‌కు దగ్గర చేసేలా ఉందన్నారు. వైఎస్సార్‌ రాజకీయ వ్యక్తిత్వానికి నిలువుటద్దం ఈ పుస్తకం అని కొనియాడారు. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్‌, హీందీ భాషల్లో కూడా అనువాదం చేసి దేశ ప్రజలతో పాటు, భావితరాలకు వైఎస్సార్‌ గొప్పతనాన్ని తెలియజేయాలని అభిప్రాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement