సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఇప్పటికే రెండు అమెరికా దిగ్గజ కంపెనీలు కీలక విషయాన్ని ప్రకటించగా, దేశీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘కోవాక్సిన్’ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించిందని భారత్ బయోటెక్ సోమవారం ప్రకటించింది. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో 25 కేంద్రాల్లో 26,000 మంది వాలంటీర్లతో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది.
భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం నిర్వహించిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్ ఇదని సంస్థ చైర్మన్ ఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. కోవిడ్19 కి సంబంధించిన ఇతర వ్యాక్సీన్ల విషయంలో కూడా తమ కంపెనీ అధ్యయనం చేస్తోందన్నారు. ఈ ట్రయల్ 2021 ప్రారంభంలో పూర్తవుతుందన్నారు. ఇది ముక్కులో వేసుకునే డ్రాప్స్ మాదిరిగా ఉండే ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది నాటికి సిద్దమవుతుందని వివరించారు. కాగా తొలి దేశీయ వ్యాక్సిన్‌గా భావిస్తున్న కోవాక్సిన్ ప్రపంచంలోనే చౌకైన వ్యాక్సిన్‌గా ఉంటుందని అంచనా. కోవాక్సిన్ మొదటి, రెండో దశ ట్రయల్స్ తాత్కాలిక విశ్లేషణ విజయవంతంగా పూర్తి అయిందని ఇటీవల సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. (వ్యాక్సిన్: ఊరటినిస్తోన్న మోడర్నా)
Comments
Please login to add a commentAdd a comment