పాట్నా: బీహార్ రాజకీయాలను వేదికగా చేసుకుని.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లు గత కొన్నివారాలుగా మాటల తుటాలు పేల్చుకుంటున్నారు. ముఖ్యంగా పీకే.. నితీశ్ ప్రభుత్వాన్ని, పాలనను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో.. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వీళ్లద్దరు భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో కలత చెందలేదు..’ భేటీ అనంతరం బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా వీళ్లు మళ్లీ చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని అక్కడి మీడియా విశ్లేషిస్తోంది. అయితే భేటీ సాధారణమైందేనని, ఎలాంటి రాజకీయాల ప్రస్తావన లేదని బయటకు వచ్చాక నితీశ్ కుమార్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.
మేము ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. అందుకే కలుసుకున్నాము. ప్రత్యేకంగా ఏమీ మాట్లాడుకోలేదు. కేవలం సాధారణ విషయాలు.. మనం ఇది చేయాలి, అలా చేయాలి అని చర్చించాం. అయినా మేం కలవడం వల్ల నష్టం ఏమిటి?.. ఇంకేమైనా ఉంటే ఆయన్నే అడగండి అంటూ మీడియాకు వివరణ ఇచ్చారు నితీశ్. పనిలో పనిగా ఓ ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో కలత చెందలేదు అని సమాధానం ఇచ్చారు.
జేడీయూ మాజీ నేత పవన్ వర్మ నితీశ్-పీకే భేటీని ఏర్పాటు చేయడం గమనార్హం. బుధవారం సాయంత్ర పాట్నాలో దాదాపు 45 నిమిషాలపాటు వీళ్లిద్దరి భేటీ జరిగింది. పవన్ వర్మ రెండేళ్ల కిందట జేడీయూకు గుడ్‌బై చెప్పారు. తాజా పరిణామంతో ఆయన మళ్లీ చేరతారా? లేదంటే పీకే వెంట ఉంటారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక పీకేతోనూ రెండేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు నితీశ్. ఈ క్రమంలో జన్ సురాజ్ పేరిట ఓ విభాగం ప్రారంభించిన పీకే.. బీహార్‌లో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు కూడా.
ఇదీ చదవండి: పళనిస్వామికి బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment