పట్నా: ప్రజల సొమ్మంటే పట్టింపే లేదు ప్రభుత్వ అధికారులకు. పైపెచ్చు ఆ సొమ్ముతో కమిషన్లు కొట్టేయడమంటే మహా ‘ఇది’. ఆఖరికి కరోనా కల్లోల సమయంలోనూ చేతి వాటం ప్రదర్శించడానికి తటపటాయించడం లేదు. ఈ అవినీతి వ్యవహరం అంతా ముఖ్యమంత్రి ప్రాంతీయ అభివృద్ధి ఫండ్‌తో పేరుతోనే జరిగినా ... అక్కడ సీఎంవోకి చీమకుట్టినట్టైనా లేదు.
మూడు రెట్లు ఎక్కువ
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ప్రజలను ఆస్పత్రులకు చేర్చేందుకు అంబులెన్సులు కొనుగోలు చేయాలని బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా అంబులెన్సుల కొనుగోలు నిర్ణయానికి పచ్చజెండా ఊపారు. అనుమతులు రావడం తరువాయి రూ. 7 లక్షలు విలువ చేసే అంబులెన్సుకు ఏకంగా రూ.21 లక్షలు చెల్లించి మరీ కొన్నారు.
చిన్న మార్పులకే
వాహనాన్ని అంబులెన్సుగా మార్చేందుకు అనువుగా పార్టిషన్ చేయడం, అందులో వెంటిలేటర్ ఇతర మెడికల్ ఎక్విప్‌మెంట్ పేరుతో అడ్డగోలుగా బిల్లులు చెల్లించారు. రూ.60,000 విలువ చేసే వెంటిలేటర్‌కి రూ.3.41 లక్షలు, రూ.8,500 విలువ చేసే సక‌్షన్ మిషన్‌కి రూ.21,000లు చెల్లించినట్టుగా బిల్లులలో పేర్కొన్నారు. అంబులెన్సులో సీట్ల పార్టిషన్ చేసినందుకు ఏకంగా రూ.1.24 లక్షలు చెల్లించారు. ఇలా ఇష్టారీతిగా బిల్లులు చెల్లిస్తూ రూ.7 లక్షలు విలువ చేసే అంబులెన్సుకు మూడింతలు అధికంగా చెల్లిస్తూ రూ.21 లక్షలకు కొనుగోలు చేశారు.
ఏడాదిగా నిరుపయోగంగా
సాధారణంగా రూ.5 లక్షలు దాటి ఏదైనా కొనుగోలు చేయాల్సి వస్తే గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధను అతిక్రమించారు అధికారులు. అంతేకాదు ముఖ్యమంత్రి ప్రాంతీయ అభివృద్ధి నిధుల నుంచి అత్యవసర పనుల పేరిట అంబులెన్సులు కొనుగోలు చేశారు. ఇలా కొన్న ఏడు అంబులెన్సుల్లో ఐదింటిని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఉపయోగించలేదు. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఇవి షెడ్డుకే పరిమితమయ్యాయి.
విచారణకు ఆదేశం
అడ్డగోలు ధరలకు అంబులెన్సులు కొనడంతో పాటు వాటిని నిరుపయోగంగా ఉంచడంపై సీఎం నితీశ్‌కుమార్‌కు మాజీమంత్రి విక్రమ్ కున్వార్ లేఖ రాయడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. బీహార్ మీడియా ప్రభుత్వ అధికారుల అవినీతిపై దుమ్మెత్తిపోస్తు కథనాలు రాశాయి. ప్రతిపక్షాలు గోలగోల చేయడంతో సివాన్ జిల్లా కలెక్టర్ అమిత్ పాండే విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment