Bihar Couple Begs To Collect Money For Bribe To Get Json Body From Hospital - Sakshi
Sakshi News home page

కొడుకు శవం ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్‌.. బిక్షమెత్తిన తల్లిదండ్రులు

Published Thu, Jun 9 2022 1:23 PM | Last Updated on Thu, Jun 9 2022 2:25 PM

Bihar Couple Begs To Collect Money For Bribe To Get Json Body From Hospital - Sakshi

పాట్నా: ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఏ కార్యాలయాల్లోనైనా పని జరగాలంటే చేతులు తడపాల్సిందే! జరిగే పని తొందరగా జరగాలన్నా కొంతమంది అవినీతి అధికారులకు డబ్బు ధార పోయాల్సిందే. కాసుల కోసం కక్కుర్తి పడే అంటువంటి లంచావతారులు చివరకు మనుషుల ప్రాణాల విషయంలోనూ తగ్గడం లేదు. పరిస్థితులు, ఆర్థిక స్థోమతను కూడా అర్థం చేసుకోకుండా బాధితుల నుంచి డబ్బులను రక్తంలా పిండుకుంటున్నారు. తాజాగా మార్చురీ నుంచి కుమారుడి మృతదేహాన్ని ఇచ్చేందుకు ఆసుపత్రి సిబ్బంది భారీ మొత్తంలో లంచం డిమాండ్‌ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేని తల్లిదండ్రులు భిక్షాటన శారు.

గుండెలు పిండిసే ఈ ఘటన బిహార్‌లో జరిగింది. సమస్తిపూర్‌ తాజ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన మహేష్‌ ఠాగూర్‌ దంపతులకు సంజీవ్‌ అనే కుమారుడు ఉన్నాడు. మానసిక వికలాంగుడైన సంజీవ్‌ అదృశ్యమయ్యాడు. అయితే జూన్‌ 6న కొడుకు మృతదేహం సమస్తిపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని తల్లిదండ్రులకు ఫోన్‌ వచ్చింది. కన్నీరుమున్నీరవుతూనే కొడుకు మృతదేహాన్ని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు. మృతదేహం తమ కొడుకుదే అని నిర్ధారించుకొని ఇంటికి తీసుకెళ్లేందుకు అధికారులను సంప్రదించారు. 

అయితే పోస్టుమార్టం సిబ్బంది నాగేంద్ర మల్లిక్‌ అనే వ్యక్తి మృతదేహాన్ని అప్పగించడానికి రూ. 50 వేలు డిమాండ్‌ చేశారు. అంత డబ్బులు వృద్ద జంట వద్ద లేకపోవడంతో బిక్షాటన ఎత్తుకోవటం ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ జోలెపట్టి అడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో స‌మ‌స్తిపూర్ స‌దార్ హాస్పిట‌ల్ ఉన్న‌తాధికారుల‌కు ఈ విషయం చేరింది దీంతో  త‌క్ష‌ణ‌మే యువకుడి డెడ్‌బాడీని అత‌ని ఇంటికి పంపించేశారు. ఈ వీడియోను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కూడా ట్విటర్‌లో షేర్‌ చేశారు. మానవత్వానికి సిగ్గుచేటు నితీష్‌ కుమార్‌ ప్రభుత్వ పాలను ఇది నిదర్శనమంటూ మండిపడ్డారు.

మరోవైపు ఈ విషయంపై సమస్తిపూర్ సివిల్ సర్జన్ మాట్లాడుతూ.. సిబ్బంది డబ్బులు అడగొచ్చు కానీ, రూ. 50,000 అయితే డిమాండ్ చేసి ఉండకపోవచ్చని అన్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది లంచం అడగడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని,  దీనిపై విచారణకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక ఈ వీడియో వైరల్‌గా మారడంతో మృతదేహాన్ని ఇవ్వడానికి లంచం డిమాండ్‌ చేసిన ఉద్యోగులపై నెటిజన్లు మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.
చదవండి: సర్పంతో మహిళ సహజీవనం.. ఆమె సమాధానం విని ఊరంతా సైలెంట్‌ !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement