న్యూఢిల్లీ: ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావితం చూపించిన వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీసహా ఐదుగురు భారతీయులు స్థానం సంపాదించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ఆందోళనలను ముందుండి నడిపించిన 82 ఏళ్ల వయసున్న బామ్మ బిల్కిస్ టైమ్ జాబితాలో స్థానం పొందారు.
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా అత్యంత ప్రభావితం చూపించిన 100 మందిలో చోటు దక్కించుకున్నారు. ఇక ఇండియన్ అమెరికన్, డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ టైమ్స్ జాబితాకెక్కారు. రాజకీయ నాయకుల కేటగిరీలో మోదీతో పాటుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉన్నారు. భారత్‌ని ముందుకు నడిపించే నాయకుడు మోదీని మించి మరొకరు లేరని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా హెచ్‌ఐవీ ఎయిడ్స్ వ్యాధిని జయించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో క్లినికల్ మైక్రోబయాలజీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
అణగారిన వర్గాల గొంతుక
షాహిన్‌బాగ్ దాదీగా పేరు సంపాదించిన బిల్కిస్ గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా 100 రోజుల పాటు రేయింబవళ్లు పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. ‘ఒక చేత్తో జపమాల, మరో చేత్తో జాతీయ జెండా పట్టుకొని అణగారిన వర్గాల గళంగా బిల్కిస్ నిలిచారు. మహిళలు, మైనార్టీల అణచివేతకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని రగిలించారు. పొద్దున్నే 8కల్లా ఠంచనుగా నిరసనకు కూర్చొనే ఆమె అర్ధరాత్రయినా కదిలేవారు కాదు’అని టైమ్ మ్యాగజైన్ ప్రొఫైల్‌లో షాహిన్‌బాగ్ దాదీ గురించి జర్నలిస్టు రాణా అయూబ్ రాసుకొచ్చారు.
ఆయుష్మాన్ భవ
ఆర్టిస్టుల కేటగిరిలో స్థానం దక్కించుకున్న బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గురించి టైమ్ ప్రొఫైల్‌లో నటి దీపికా పదుకొనె రాశారు. కన్న కలలు నిజం కావడం చాలా కొద్ది మంది చూస్తారని, అందులో ఆయుష్మాన్ ఒకరని అన్నారు. ఆయనలో ప్రతిభ, కష్టపడే తత్వంతో పాటుగా సహనం, పట్టుదల, నిర్బయంగా ముందుకు దూసుకుపోయేతత్వాన్ని దీపిక ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment