లక్నో: బీజేపీ నేత, రాంపూర్ మాజీ ఎంపీ జయప్రద.. సమాజ్ వాదీ సీనియర్ ఆజాంఖాన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన ఎన్నో పాపాలు చేశారని, చేసిన తప్పులకు ఆయన తప్పక శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు.
ఆదివారం మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మాజీ నటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో పార్టీల మధ్య వైవిధ్యాలు, విభేధాలు సహజం. కానీ, అధికారం ఉంది కదా అని మహిళలను అగౌరవపరచడం, పేదలకు అన్యాయం చేయడం సరికాదు. అజాం ఖాన్ ఆయన వారసుడు అబ్దుల్లా ఖాన్ లకు మహిళలను గౌరవించడం ఏమాత్రం తెలియదు. ఆజాం ఖాన్ ఆట ముగిసింది. చేసిన పాపాలకు వాళ్లు అనుభవించకతప్పదు అని జయప్రద పేర్కొన్నారు.
ఇక వచ్చే ఏడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావించిన ఆమె.. నరేంద్ర మోదీ నాయకత్వంలో మరోసారి బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్ కూడా బీజేపీ వశం అవుతుందని జోస్యం చెప్తున్నారామె.
ఇదిలా ఉంటే.. జయప్రద, ఆజాంఖాన్ గతంలో పరస్పర విమర్శలతో వివాదాల్లో చిక్కుకున్నారు. 2019 ఎన్నికల్లో జయప్రద రాంపూర్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగగా.. ఆజాం ఖాన్ ‘ఖాకీ అండర్ వేర్‘ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మరోవైపు ఆ టైంలో ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది.
కిందటి ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ సదర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆజాం ఖాన్. అయితే.. 2019 లోక్ సభ ప్రచారం సందర్భంగా విద్వేష పూరిత ప్రసంగం చేసిన కేసులో ఆజాంఖాన్ కు మూడేళ్ల శిక్ష పడింది. దీంతో చట్ట ప్రతినిధుల నిబంధనల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు పడింది. తాజాగా ఇక ఆయన తనయుడు అబ్దుల్లా ఖాన్ కు(ఆజాంఖాన్ కు కూడా) తాజాగా 2008 నాటి కేసులో కోర్టు రెండేళ్ల శిక్ష విధించగా.. ఎమ్మెల్యే పదవిని అనర్హతతో కోల్పోయారాయన.
Comments
Please login to add a commentAdd a comment