బెంగళూరు: యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, తయారీ రంగంలో పది లక్షల ఉద్యోగాలు, బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రీజియన్ ట్యాగ్.. ఇలా కీలకమైన 16 హామీలతో బీజేపీ కర్ణాటక ఎన్నికల కోసం మ్యానిఫెస్టోను విడుదల చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం.. ‘బీజేపీ ప్రజా ప్రణాళిక’ పేరిట బెంగళూరులో ఇవాళ(సోమవారం) బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా మేనిఫెస్టో రిలీజ్ అయ్యింది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, పార్టీ సీనియర్ బీఎస్ యడ్యూరప్ప సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎవరికీ బుజ్జగింపుల్లేవ్.. అందరికీ న్యాయం పేరిట విజన్‌తో బీజేపీ ముందుకు సాగుతోందని జేపీ నడ్డా మీడియాకు తెలిపారు. అంతేకాదు రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమలు అవుతున్న ముస్లింల రిజర్వేషన్‌ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించారాయన. అంతేకాదు.. ప్రతీ వర్గానికి సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారాయన.
ఇదిలా ఉంటే.. ముస్లిం రిజర్వేషన్ కోటా నుంచి 4 శాతం వెనక్కి తీసుకున్న బొమ్మై కేబినెట్.. కన్నడనాట రాజకీయంగా ప్రభావం చూపే రెండు వర్గాలకు లింగాయత్‌లకు, వొక్కలిగాస్‌కు సమానంగా పంచాలని నిర్ణయించింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసనలకు దిగగా.. తాము అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరిస్తామని జేడీఎస్ ప్రకటించింది.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో..
రైతుల కోసం 30 వేల కోట్ల రూపాయల ఫండ్ ప్రకటించింది. మైక్రో కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు, ప్రతీ గ్రామ పంచాయితీలో అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కమిటీలను ఆధునీకరించడం లాంటి హామీలు ఇచ్చింది.
► టూరిజం సెక్టార్ కోసం.. 1,500 కోట్ల ఫండ్ ప్రకటించింది. దేశంలోనే టాప్ టూరిజం హబ్‌గా కర్ణాటకకు తీర్చిదిద్దేందుకు ఈ ఫండ్‌ను ఉపయోగించనున్నట్లు ప్రకటించింది.
► పేదలకు 10 లక్షల ఇళ్ల పట్టాలను అందజేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.
► దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవాళ్లకు.. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేత.
► పేదలకు ఉచితంగా పాలు, ఐదు కేజీల బియ్యం.
► నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతి వార్డులో 'అటల్ ఆహార కేంద్రం’ ఏర్పాటు.
► మైసూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అతిపెద్ద పునీత్ రాజ్‌కుమార్ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది.
► విశ్వేశ్వరయ్య విద్యా యోజన కింద ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడించింది.
► వచ్చే ఐదేళ్లలో 200 చేపల పెంపకం ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేస్తామని తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
ఇదీ చదవండి: బీజేపీ మహిళా కార్యకర్త అత్యుత్సాహం.. ప్రధాని మోదీపైకి..
Comments
Please login to add a commentAdd a comment