బెంగళూరు: కర్ణాటక బీజేపీలో అసంతృప్త జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 189 మందితో కూడిన తొలి జాబితాలో 52 కొత్త ముఖాలకు చోటు ఇవ్వడం, సిట్టింగ్‌లతో సహా ఆశావహులకు మొండిచేయి చూపించడంతో తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో.. పలువురు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాదీ బుధవారం తన రాజీనామా ప్రకటించారు. బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆయన.. పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నేను ఆత్మగౌవరం ఉన్న రాజకీయ నేతను. టికెట్ కోసం గిన్నె పట్టుకుని పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగి అడుక్కోలేను. ఎవరి ప్రభావం నా మీద లేదు. నా నిర్ణయం నేనే తీసుకున్నా అంటూ లక్ష్మణ్ సవాదీ బీజేపీకి రాజీనామా ప్రకటించారు.
ఇక ఆయన కాంగ్రెస్‌లోకి మారతారనే ప్రచారం ఊపందుకోగా.. కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్ స్పందించారు. ఆయన(లక్ష్మణ్) మాతో టచ్‌లో లేడు. ఆయనతో మేం మాట్లాడనూ లేదు అని శివకుమార్ తెలిపారు.
లక్ష్మణ్ సవాదీ.. మాజీ ముఖ్యమంత్రి యాడియూరప్పకు వీరవిధేయుడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమతహల్లి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. లింగాయత్ నేతల్లో పవర్‌ఫుల్ లీడర్‌గా లక్ష్మణ్‌కు పేరుంది. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికల పర్వంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. అయితే.. 2012లో అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడి.. వివాదంలో చిక్కుకున్నారాయన.
మరోవైపు బీజేపీ అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. టికెట్లు రావనే పార్టీ అధిష్టానం స్పష్టత నడుమ.. మంగళవారం ఆ పార్టీ సీనియర్ నేత ఈశ్వరప్ప ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించుకున్నారు. అలాగే.. మాజీ సీఎం జగదీస్ షెట్టర్‌కు ఊహించినట్లుగానే మొదటి లిస్ట్‌లో చోటు దక్కకపోగా.. ఆయన సైతం వ్యతిరేక గళం వినిపించారు. రెండో లిస్ట్‌లో చోటు దక్కకపోతే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి వెళ్తానంటూ ప్రకటించారాయన. ఇదే బాటలో మరో 30 మంది నేతలు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment