లక్నో/హాథ్రస్: హత్యాచార నిందితులకు మద్దతుగా హాథ్రస్‌లో ఆదివారం బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ్‌వీర్ సింగ్ పహిల్వాన్ నివాసంలో ఒక సమావేశం జరిగింది. నిందితులకు మద్ధతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారని రాజ్‌వీర్ సింగ్ కుమారుడు మన్వీర్ సింగ్ తెలిపారు. అగ్రకులాల వారే కాకుండా, సమాజం లోని అన్ని వర్గాల వారు ఈ సమావేశానికి వచ్చారన్నారు. బాధిత కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేయాలని ఆ సమావేశంలో డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పలుమార్లు తమ స్టేట్‌మెంట్‌ను మార్చారని ఆరోపించారు.
ఈ సమావేశం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. ‘సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం. వారి దర్యాప్తుపై మాకు విశ్వాసముంది’ అని మన్వీర్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఇది. ఎలాంటి విచారణకైనా నిందితులు సిద్ధంగా ఉన్నారు. వారు తప్పు చేసి ఉంటే ఎప్పుడో పారిపోయేవారు. బాధిత కుటుంబమే ఎప్పటికప్పుడు మాట మారుస్తోంది. నార్కో టెస్ట్‌కో లేక సీబీఐ దర్యాప్తుకో వారు సిద్ధంగా లేరు’ అన్నారు.
కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
హాథ్రస్ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిఫారసు చేసిన మర్నాడు కూడా.. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన దర్యాప్తు కొనసాగించింది. ఆదివారం సీనియర్ ఐపీఎస్ అధికారి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో సిట్ బాధితురాలి కుటుంబసభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అలాగే, ఈ కేసు విషయంలో సమాచారం ఇవ్వాలనుకునే వారు తమ వద్దకు రావాలని గ్రామస్తులకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment