సాక్షి, న్యూఢిల్లీ: తొలకరి పలకరిస్తున్న వేళ అన్నదాతకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఖరీఫ్ సీజన్ ఆంరభమవుతున్న తరుణంలో 2022–23 సీజన్‌కు వరి సహా 14 రకాల పంటల మద్దతు ధరలను పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై మద్దతు ధరను రూ.100 పెంచారు. సాధారణ రకం క్వింటాల్ రూ.1,940 ఉండగా తాజా నిర్ణయంతో రూ. 2,040కు పెరగనుంది. గ్రేడ్–ఏ రకం రూ.1,960 నుంచి రూ.2,060కు పెరగనుంది. రైతులకు మరింత ఆర్థ్ధిక ప్రోత్సాహమిచ్చేందుకు వరి విస్తీర్ణాన్ని పెంచేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
పప్పుధాన్యాలు..నూనె గింజల సాగుకు ప్రోత్సాహమిచ్చేలా...
కొన్నేళ్లుగా నూనెగింజలు, పప్పుధాన్యాల ధరలు దేశీయంగా అనూహ్యంగా పెరగడం, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు తీసుకుంది. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు వాటి మద్దతు ధరలను గణనీయంగా పెంచింది. నువ్వుల మద్దతు ధర గరిష్టంగా రూ.523, సోయాబీన్ రూ.350, సన్‌ఫ్లవర్ రూ.300, వేరుశనగ రూ.300 పెరిగాయి. పెసర ధర రూ.480, కంది, మినప రూ.300 పెరిగాయి. జాతీయ సగటు ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లుండేలా మద్దతు ధరను నిర్ణయించినట్టు కేంద్రం ప్రకటించింది.
తాజా పెంపుతో ఎనిమిది పంటలకు మద్దతు ధర ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును మరింతగా ప్రోత్సహించడం, డిమాండ్–సరఫరా అసమతుల్యతను సరిచేయడానికి మద్దతు ధరలను పెంచామన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ రంగ సమగ్రాభివృధ్ధికి మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు
భారత్–యూఏఈ మధ్య పరిశ్రమలు, అధునాతన పరిజ్ఞానాల్లో సహకారానికి అవగాహన ఒప్పంద ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. 10 సమాచార ఉపగ్రహాలను అంతరిక్ష శాఖ అధీనంలోని ఎన్‌ఎస్‌ఐఎల్‌కు బదిలీ చేసే ప్రతిపాదనను కూడా ఆమోదించింది. వాతావరణ మార్పులపై సంయుక్త పరిశోధన కోసం ఏరిస్, జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఒప్పందానికీ ఆమోదముద్ర వేసింది.
Comments
Please login to add a commentAdd a comment