సాక్షి, న్యూఢిల్లీ: చట్టాలు రూపొందించే బాధ్యత పార్లమెంట్‌దేనని, తామెలా రూపొందిస్తామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై వచ్చే అనర్హత విజ్ఞప్తులపై లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, రాజ్యసభ చైర్‌పర్సన్ నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితిని విధించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా అనర్హత పిటిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని, ఆయా కేసుల్లో ఏకరూప నిర్ణయం తీసుకొనేలా ఆదేశించాలంటూ ఏఐసీసీ సభ్యుడు రణజిత్ ముఖర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ చేసిన విజ్ఞప్తి పార్లమెంట్ పరిధిలోనిదని, కోర్టు చట్టాల రూపకల్పన చేయదని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘చట్టాలు మేమెలా రూపొందిస్తాం? అది పార్లమెంటుకు సంబంధించిన విషయం’’ అని జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. ‘‘కర్ణాటక ఎమ్మెల్యే విషయంలో అభిప్రాయం ఇప్పటికే చెప్పాం. ప్రస్తుత పిటిషన్‌లోని అంశమే కర్ణాటక ఎమ్మెల్యే కేసులోనూ వచ్చింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఇదే వాదన వినిపించారు. ఆ విషయాన్ని మేం పార్లమెంటుకు విడిచిపెట్టాం. ఆ తీర్పు చదువుకొని సుప్రీంకోర్టుకు రావాల్సింది’’ అని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment