కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ అధికారులు బుధవారం(సెప్టెంబర్18) కీలక విషయాలు వెల్లడించారు. హత్యాచారం సమయంలో కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్ ధరించిన దుస్తులను కోల్‌కతా పోలీసులు ఆలస్యంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.
హత్య జరిగిన రోజు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ సెమినార్‌హాల్‌లోకి నిందితుడు సంజయ్‌రాయ్ వస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా కేసులో సంజయ్‌రాయ్ ప్రధాన నిందితుడని హత్య జరిగిన మరుసటి రోజే స్పష్టమైంది. అయినా హత్య సమయంలో రాయ్ ధరించిన దుస్తులను సీజ్ చేసేందుకు కోల్‌కతాలోని తాలా పోలీస్‌స్టేషన్ పోలీసులకు రెండు రోజులు పట్టింది.
ఒకవేళ హత్యాచారం జరిగిన మరుటిరోజే రాయ్ దుస్తులను సీజ్ చేసి ఉంటే మరిన్ని కీలక ఆధారాలు లభించి ఉండేవి’అని సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్‌రాయ్‌తో పాటు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్, తాలా మాజీ సీఐ అభిజిత్ మండల్‌ను సీబీఐ ఇప్పటివరకు అరెస్టు చేసింది. అయితే వీరు విచారణలో సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తెలిపింది.
రాయ్,ఘోష్,మండల్‌లు కుట్ర చేశారా..? సీబీఐ కూపీ..!
మహిళా డాక్టర్ హత్యాచారంలో సంజయ్ రాయ్, ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఘోష్, తాలా పీఎస్ సీఐ మండల్ మధ్య కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ సీబీఐ కూపీలాగుతున్నట్లు తెలుస్తోంది. హత్యకు ముందు వీరు ముగ్గురి మధ్య ఏమైనా ఫోన్‌కాల్స్ నడిచాయా అన్నకోణంలోనూ శోధిస్తున్నట్లు సమాచారం.
ఆగస్టు9 తెల్లవారుజామున కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో సెమినార్‌హాల్లో నిద్రపోతున్న మహిళా ట్రైనీ డాక్టర్‌పై లైంగికదాడి చేసి హత్యచేశారు. ఈ కేసును తొలుత కోల్‌కతా తాలా పీఎస్ పోలీసులు దర్యాప్తు చేయగా హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతలను ఐదు రోజుల తర్వాత సీబీఐ తీసుకుంది. కేసు దర్యాప్తును స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుండడం గమనార్హం.
ఇదీ చదవండి.. కోల్‌కతా సీపీగా మనోజ్‌వర్మ
Comments
Please login to add a commentAdd a comment