న్యూఢిల్లీ: జూన్ నెలలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం సుమారు 12 కోట్ల డోసుల టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. మే నెలలో 7.94 కోట్ల డోసుల టీకా అందిందని తెలిపింది. వినియోగించే తీరు, జనాభా, టీకా వృథా వంటి అంశాల ఆధారంగానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు టీకా సరఫరా అవుతోందని ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్ నెలలో అందాల్సిన టీకా డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ముందుగానే చేరే అవకాశం ఉందని తెలిపింది. ‘ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్ల పైబడిన ప్రాధాన్యతా గ్రూపుల వారికోసం రాష్ట్రాలకు జూన్ నెలకు గాను 6.09 కోట్ల డోసుల టీకాను ప్రభుత్వం ఉచితంగా అందజేయనుంది’ అని ఆరోగ్య శాఖ పేర్కొంది.
మరో 5.86 కోట్ల డోసుల టీకాను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రైవేట్ ఆస్పత్రులు కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి’ అని వివరించింది. రాష్ట్రాలు టీకా డోసుల వృథాను అరికట్టి, న్యాయబద్ధంగా వినియోగించాలని కోరింది. మే నెలలో కేంద్రం రాష్ట్రాలకు 4.03 కోట్ల టీకా డోసులను ఉచితంగా సరఫరా చేయగా మరో 3.90 కోట్ల డోసులను నేరు గా కొనుగోలు చేసుకునేలా రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్ప త్రులకు అందుబాటులో ఉంచినట్లు వివరించింది.
జూన్‌లో 10 కోట్ల కోవిషీల్డ్ డోసులు ఉత్పత్తి చేయగలం
జూన్ నెలలో సుమారు 10 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను ఉత్పత్తి చేసి, సరఫరా చేయగలమంటూ ఆదివారం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) కేంద్రానికి తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మహమ్మారి కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే తమ సిబ్బంది, నిర్విరామంగా టీకా తయారీలో నిమగ్నమై ఉన్నారని హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో సీరం పేర్కొంది. మేలో 6.5 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి చేశాం. రానున్న నెలలో ఉత్పత్తిని మరింత పెంచేందుకు కృషి చేస్తాం’అని తెలిపింది. కాగా, సీరం ఇన్‌స్టిట్యూట్ మేలో 6.5 కోట్ల డోసుల టీకాను ఉత్పత్తి చేసింది.
చదవండి: ప్రధాని ‘మన్ కీ బాత్’ లో విజయనగరం మామిడి ప్రస్తావన
Comments
Please login to add a commentAdd a comment