
న్యూఢిల్లీ: బెంగాల్ చీఫ్ సెక్రటరీ రగడ ఇంకా చల్లారడం లేదు. న్యూఢిల్లీ, కోల్‌కతల మధ్య రోజుకో మలుపు తీసుకుంటోంది. బెంగాల్ సీఎస్ కేంద్రంగా ఇటు సీఎం మమత అటు పీఎం మోదీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పైచేయి సాధించేందుకు పోటీలు పడుతున్నారు.
షోకాజ్ నోటీసులు
పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఆలాపన్ బందోప్యాధ్యాయపై కేంద్రం గుస్సా అయ్యింది. కేంద్రం జారీ చేసిన ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ ప్రకారం సోమవారం న‍్యూఢిల్లీలో ఎందుకు రిపోర్టు చేయలేదో చెప్పాంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో సమాధానం చెప్పాలంటూ గడువు విధించింది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. షోకాజ్ నోటీసుకు మూడు రోజుల్లోగా సరైన సమాధానం చెప్పకుంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు వెనుకాడబోమని కేంద్రం తేల్చి చెప్పింది.
అటు ఇటు
బెంగాల్ చీఫ్ సెక్రటరీగా ఆలాపన్ బందోప్యాధ్యాయ పదవి కాలం జూన్ 1తో ముగుస్తోంది. 60 ఏళ్లు నిండటంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆలాపన్‌కి పొడిగింపు ఇవ్వాలంటూ బెంగాల్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీంతో మూడు నెలల పదవి కాలం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల జరిగిన యాస్ తుపాను సమీక్ష సందర్భంగా ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆలాపన్ హాజరు కాలేదు. సీఎం మమత వెంటే ఉంటూ ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆగ్రహించిన కేంద్రం ఆయనకి ఇచ్చిన ఎక్స్‌టెన్షన్‌ను రద్దు చేసింది. అంతేకాదు బెంగాల్ రాష్ట్ర సర్వీసు నుంచి కేంద్ర సర్వీసులకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఉన్నపళంగా ఢిల్లీలో రిపోర్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
నాటకీయ పరిణామాలు
బెంగాల్ సీఎస్ ఆలాపన్ బందోప్యాధ్యాయ పదవీ కాలం పొడిగించాలని, బదిలీ రద్దు చేయాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. అయితే కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇంతలో సోమవారం సాయంత్రం తన చీఫ్ సెక్రటరీ పదవికి ఆలాపన్ బందోప్యాధ్యాయ రాజీనామా చేశారు. వెంటనే మూడేళ్ల కాలానికి ఆలాపన్‌ని ప్రభుత్వ సలహదారుగా నియమిస్తున్నట్టు మమత బెనర్జీ ప్రకటించారు.
అడకత్తెరలో పోక చెక్కలా
ఆలాపన్ బందోప్యాధ్యాయని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ కావడం ఆలస్యం కేంద్రం రంగంలోకి దిగింది. వెంటనే ఢిల్లీలో రిపోర్టు చేయకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటు కేంద్రం, అటు రాష్ట్రం మధ్య జరుగుతున్న సమరంలో ఐఏఎస్ అధికారి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది.
Comments
Please login to add a commentAdd a comment