న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 67 బొగ్గు బ్లాకులను (గనులు/నిక్షేపాలు) విక్రయానికి పెట్టింది. రెండో దశ వాణిజ్య బొగ్గు మైనింగ్ వేలాన్ని గురువారం ప్రారంభించి.. ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేసిన అడుగుగా అభివర్ణించింది. 2014లో వాణిజ్య ప్రాతిపదికన బొగ్గు గనులను ప్రారంభించిన తర్వాత ఒక విడతలో అత్యధిక బ్లాక్‌లను వేలానికి ఉంచడం ఇదే ప్రథమం. వేలాన్ని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, బొగ్గు శాఖ సెక్రటరీ అనిల్ కుమార్ జైన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విక్రయించనున్న 67 గనుల్లో 23 కోల్‌మైన్స్ చట్టం కింద, 44 మైన్స్ అండ్ మినరల్స్ చట్టం పరిధి కింద ఉన్నాయి.
కోకింగ్, నాన్‌కోకింగ్ కలసి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర పరిధిలో ఈ గనులు విస్తరించి ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. అపారమైన బొగ్గు నిల్వలను వినియోగించుకునేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడమేకాక దేశాభివృద్ధికి పాటుపడాలని ప్రహ్లాద్ జోషి కోరారు. వాణిజ్య బొగ్గు మైనింగ్ ద్వారా కొత్త పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్పారు. బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రాల్లో సామాజిక-ఆర్థిక అభివృద్ధి మేరుగుపడుతుందని అని అన్నారు. బొగ్గు రంగంలో గత విజయాలను పరిశీలించాక, భవిష్యత్తులో వేలం నిర్వహించడానికి ప్రభుత్వం ‘రోలింగ్ యాక్షన్’ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు మంత్రి ప్రకటించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment