సాక్షి,న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరికీ కరోనా టీకా లక్ష్యంలో భాగాంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ (బీఈ) కోవిడ్ వ్యాక్సిన్ కోసం భారీ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ టీకాకోసం 1,500 కోట్లు రూపాయల మేర ముందస్తు డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ఆగస్టు - డిసెంబర్ మధ్య 30 కోట్ల డోసులను కంపెనీ ఉత్పత్తి చేయనుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోవాగ్జిన్ తరువాత దేశంలో అందుబాటులోకి రానున్న రెండో మేడిన్ ఇండియా వ్యాక్సిన్ ఇదని పేర్కొంది. ఒకటి, రెండు దశల ప్రయోగాల్లో మంచి ఫలితాలను చూపించిన తరువాత బయోలాజికల్-ఇ వ్యాక్సిన్ ప్రస్తుతం ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌లో ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
రాబోయే కొద్ది నెలల్లో ఈ టీకా అందుబాటులో ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. అయిదు లేదా ఆరు కొత్త కోవిడ్-19 వ్యాక్సిన్లకు మద్దతు ఇవ్వాలన్న ప్రభుత్వ మిషన్‌లో భాగమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండో దశలో కరోనా విలయం, వ్యాక్సిన్ల కొరత, టీకా విధానంపై విమర్శల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2021 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు బయోలాజికల్ ఈ మోతాదులను తయారు చేసి నిల్వ చేస్తామని వెల్లడించింది. కాగా దేశంలో ఆగస్టునాటికి రోజుకు కోటి డోసుల వ్యాక్సిన్లు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే కోవాగ్జిన్, కోవీషీల్డ్ , స్పుత్నిక్-వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే విదేశాల్లో డబ్ల్యుహెచ్‌వో ఆమోదం లభించిన ఫైజర్, మోడర్నాలాంటి ఇతర విదేశీ వ్యాక్సిన్లకు కూడా శరవేగంగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment