సాక్షి, చెన్నై: చిరు ఉద్యోగులే బైక్‌లు, కార్లు వినియోగిస్తున్న ఈ రోజుల్లో ఓ పోలీస్ అధికారిణి గత 23 ఏళ్లుగా సైకిల్ పైనే విధులకు హాజరవుతుండడం కచ్చితంగా విశేషమే. వివరాలు.. చెన్నై షావుకారుపేటలోని ఫ్లవర్ బజార్ పోలీసు స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల జి.పుష్పరాణి రోజూ సైకిల్ పైనే డ్యూటీకి వెళ్తారు. అలాగేే తన ఇంటి పనులకు సైతం దాన్నే వాడుతారు.
1997లో ఈమె తమిళనాడు స్పెషల్ పోలీసు విభాగంలో గ్రేడ్– 1 కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత పదోన్నతి ద్వారా పుదుపేట ఆర్మ్‌డ్ రిజర్వుకు బదిలీ అయ్యారు. విశ్రాంత ఎస్‌ఐ అయిన తన తండ్రి గోవింద స్వామి సైకిల్ పైనే విధులకు వేళ్లేవారని ఆమె పేర్కొన్నారు. తండ్రి స్ఫూర్తితో దాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఏడో సైకిల్ చెన్నై సిటీ పోలీసు కమిషనర్ శంకర్ జివాల్ బహుమతిగా ఇచ్చారని వెల్లడించారు.
ఎవరినీ సైకిల్ తొక్కమని బలవంతం చేయనని, అలాగే తనను సైకిల్ నుంచి ఎవరూ దూరం చేయలేరని పుష్పరాణి స్పష్టం చేశారు. తన ఇద్దరు పిల్లలను మాత్రం ఆరోగ్య సంరక్షణ కోసం సైకిల్ పైనే పాఠశాలకు వేళ్లేలా ప్రేరేపిస్తున్నట్లు చెప్పారు. ధనవంతులకు సైకిల్ వ్యాయామం అయితే.. పేదలకు అది జీవనాధారం అని ఆమె తెలిపారు. ఫ్లవర్ బజార్ పోలీసు స్టేషన్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ డి. ఇంద్ర మాట్లాడుతూ సబ్ ఇన్‌స్పెక్టర్ పుష్పారాణి ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment