సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం చలామణిలో ఉన్న రూ. 2 వేల నోటు రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టారు. అదొక తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. పైగా నలధనాన్ని వెలికి తీసేందుకే ఈ పెద్ద నోట్లని రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రెండు వేల రూపాయల నోటు మార్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు, ఆధారాలు అవసరం లేదని బ్యాంకులు స్పష్టం చేశాయి.
అంటే దీని అర్థం నల్లదనాన్ని మార్చుకునే వారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ వెసులుబాటు కల్పించినట్లేగా అని ఎద్దేవా చేశారు. నిజానికి సాధారణ ప్రజల వద్ద రూ. 2 వేల రూపాయల నోట్లు ఉండనే ఉండవు. 2016లో డీ మానిటైజేషన్ పేరిట ప్రవేశపెట్టిన నోట్ల రద్దుతో ప్రజలు పెద్ద నోట్లకు చాలా దూరంగా ఉన్నారన్నారు.
అయినా రోజువారి చిల్లరకు ఆ నోటు సామాన్యులకు పెద్దగా ఉపయోగం ఉండదు కూడా అని చెప్పారు. నల్లధనాన్ని కూడబెట్టేవారికి సులభంగా దాచుకునేందుకు మాత్రమే ఆ నోటు ఉపయోగపడుతుందన్నారు. 2016 తర్వాత సరిగ్గా ఏడేళ్లకి ఈ మూర్ఖపు చర్యను తీసుకున్నందుకు సంతోషం అని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా, శుక్రవారమే భారత రిజర్వ్ బ్యాంకు రూ.2 వేల నోటుని చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రజలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇవ్వడమే గాక అందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు కూడా అవసరం లేదని ప్రకటించడం గమనార్హం.
మరోవైపు ఈ రూ. 2 వేల రూపాయల నోటుని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపదని, కేవలం అక్రమ డబ్బు తరలింపును కష్టతరం చేయడానికేనని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పడం విశేషం.
(చదవండి: శ్రీనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత..భారీగా బలగాలు మోహరింపు)
Comments
Please login to add a commentAdd a comment