సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం విరుచుకుపడ్డారు. రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం గురించి రాజ్‌నాథ్ ఆడంబర వ్యాఖ్యలు చేసి ఆపై నీరుగార్చే ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఉదయం మెరుపులు ఉంటాయని హామీ ఇచ్చిన రక్షణ మంత్రి ఆపై నిట్టూర్పుతో ముగించారని వరుస ట్వీట్లలో చిదంబరం పేర్కొన్నారు. రక్షణ పరికరాలను కేవలం రక్షణ మంత్రిత్వ శాఖే దిగుమతి చేసుకుంటోందని దిగుమతి ఆంక్షలు ఏమైనా కేవలం ఆ ఒక్క శాఖకే వాటి ప్రభావం పరిమితమని చిదంబరం వ్యాఖ్యానించారు. దిగుమతి ఆంక్షలనేది పెద్ద మాటని అన్నారు. చదవండి : ‘అలా చేస్తే.. చైనా ఆక్రమణలు తొలగిస్తారా?
తాము ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న పరికరాలను ఇక్కడే తయారుచేసేందుకు ప్రయత్నించి రెండు నుంచి నాలుగేళ్లలో దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని రక్షణ మంత్రి చెప్పుకొచ్చారని అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం వెల్లడించిన చారిత్రక ప్రకటనలో పసఏమీ లేదని, ఇది కేవలం మంత్రి తన కార్యదర్శులకు జారీ చేసే శాఖాపరమైన ఉత్తర్వు మాత్రమేనని చిదంబరం ఎద్దేవా చేశారు. కాగా, 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపారు. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆయుధాలతో పాటు ఇతర రక్షణ వస్తువులు ఇక మీదట దేశీయంగానే తయారవనున్నాయి. ఇది భారత రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజనాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment