కోల్‌కత్తా డాక్టర్‌ కేసు విచారణ.. ‘1973’ భయంకర ఘటనను గుర్తు చేసిన సీజే | Chief Justice Cites Aruna Shanbaug Incident In Kolkata Horror Case | Sakshi
Sakshi News home page

కోల్‌కత్తా డాక్టర్‌ కేసు విచారణ.. ‘1973’ భయంకర ఘటనను గుర్తు చేసిన సీజే

Published Tue, Aug 20 2024 5:30 PM | Last Updated on Tue, Aug 20 2024 6:12 PM

Chief Justice Cites Aruna Shanbaug Incident In Kolkata Horror Case

ఢిల్లీ: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ 1973 అరుణా షాన్‌బాగ్ సంఘటనను ప్రస్తావించారు. ప‌ని ప్ర‌దేశాల్లో మ‌హిళ‌ల సంఖ్య పెరుగుతుందని.. వివక్ష కారణంగా మ‌హిళా డాక్ట‌ర్లను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మ‌రో అత్యాచార ఘ‌ట‌న జ‌రిగే వ‌ర‌కు ఎదురుచూడాల్సిన అవ‌స‌రం లేద‌ని, కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అరుణా షాన్‌బాగ్‌కు జ‌రిగిన అన్యాయం, వైద్య రంగంలోనే ఘోర‌మైన ఘ‌ట‌న అని సీజే త‌న తీర్పు స‌మ‌యంలో గుర్తు చేశారు.

42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా..
1967లో అరుణా షాన్‌బాగ్‌ కేఈఎం ఆస్ప‌త్రిలో స‌ర్జ‌రీ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. డాక్ట‌ర్ సుందీప్ స‌ర్దేశాయి వ‌ద్ద ఆమె ప‌నిచేశారు. 1974లో ఆమె ఓ డాక్ట‌ర్‌ను పెళ్లి చేసుకోవాల‌ని భావించింది. కానీ 1973, న‌వంబ‌ర్ 27వ తేదీన ఆమెపై వార్డు అటెండెంట్ పైశాచికంగా దాడి చేశాడు. లైంగికంగా దాడి చేసి, ఆమెను తాడుతో క‌ట్టేశాడు. దీంతో ఆమె మెద‌డుకు తీవ్ర‌మైన గాయమైంది. 42 ఏళ్ల పాటు ఆమె అచేతన స్థితి(కోమా)లో ఉండిపోయింది. 2015లో ఆమె తుది శ్వాస విడిచింది.

ఆమె జీవితంలో చీకటి నింపిన ఆరోజు:
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హల్దీపూర్‌కు చెందిన అరుణ షాన్‌బాగ్‌కు అప్పుడు 25 ఏళ్లు. రోగులకు సేవ చేసే నర్సింగ్ వృత్తి అంటే ఇష్టం. ఆ మక్కువే ఆమెను ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్(కేఈఎంహెచ్) వైపు నడిపింది. నర్సుగా జీవితాన్ని ప్రారంభించింది. ఎప్పుడూ ఉత్సాహంగా, అందరితో కలివిడిగా ఉండే ఈమెపై అదే ఆసుపత్రిలో వార్డుబాయ్‌గా పనిచేసే సోహన్‌లాల్ భార్తా వాల్మీకి అనే దుర్మార్గుడి కన్ను పడింది. 1973, నవంబర్ 27 రాత్రి ఎప్పట్లాగే అరుణ విధులు ముగించుకుంది.

రూమ్‌కి వెళ్లేందుకు బేస్‌మెంట్‌లోని ఓ గదిలో బట్టలు మార్చుకుంటోంది. ఇదే సమయంలో సోహన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో కుక్కల్ని కట్టేసే గొలుసును ఆమె గొంతుకు బిగించాడు. పశువులా ప్రవర్తించి పారిపోయాడు. అతడి దాడితో మెడ నుంచి మెదడుకు వెళ్లే నాడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అరుణ అక్కడికక్కడే కుప్పకూలింది. కోమాలోకి వెళ్లిపోయింది. వెన్నెముక కూడా దెబ్బతింది. అప్పట్నుంచి అచేతనంగానే ఉండిపోయింది.

కామాంధుడికి ఏడేళ్ల శిక్షతో సరి..
సోహన్‌లాల్ పోలీసులకు చిక్కాడు. దోషిగా తేలాడు. కానీ అత్యాచారం కేసు కింద అతడిని శిక్షించలేదు. ఈ హేయమైన రాక్షస క్రీడను న్యాయస్థానం దొంగతనం, దాడిగానే చూసింది. ఒక్కో కేసు(దొంగతనం, దాడి)లో ఏడేళ్ల శిక్ష విధించాయి. ఆ శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పు చెప్పడంతో కేవలం ఏడేళ్ల శిక్ష అనుభవించి సోహన్‌లాల్ బయటకొచ్చాడు. 

అరుణ కేసు.. న్యాయ చరిత్రలో ఓ మైలురాయి!
ఒంటి నిండా పుండ్లు, కదల్లేని అవయవాలతో కేఈఎం ఆసుపత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వార్డు నంబర్ 4లో బెడ్‌పై ఏళ్లుగా అరుణ అనుభవిస్తున్న బాధ ఎందరినో కలచివేసింది. వారిలో ఆమె స్నేహితురాలు, జర్నలిస్టు పింకి విరానీ ఒకరు. సంవత్సరాల తరబడి పడుతున్న బాధ నుంచి విముక్తి చేస్తూ అరుణను కారుణ్య మరణం కింద చంపేసేందుకు అనుమతించాలంటూ ఆమె 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇది అప్పట్లో కారుణ్య మరణంపై దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది.

వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. అరుణ పరిస్థితి తెలుసుకునేందుకు వైద్య నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం అదే ఏడాది మార్చి 7న కోర్టు చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. విరానీ పిటిషన్‌ను తోసిపుచ్చినా.. కారుణ్య నియామకానికి పాక్షిక చట్టబద్ధత కల్పించింది. నయం కాని రోగంతో శాశ్వత అచేతన స్థితి (పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్) ఉన్న రోగులను చట్టపరమైన విధివిధానాలకు లోబడి ప్రాణరక్షక వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగా తొలగించి, వారి మరణాన్ని వేగవంతం చేసే పరోక్ష కారుణ్య మరణానికి సానుకూలత ప్రకటించింది. తర్వాత కాలంలో అరుణ కన్నీటి జీవితంపై విరానీ ‘అరుణ స్టోరీ’ అనే పుస్తకం రాశారు. దత్తకుమార్ దేశాయ్ అనే మరాఠా రచయిత ‘కథ అరునాంచి’ అనే నాటకం రాశారు. ఈ నాటకం మహారాష్ట్రలో పలు చోట్ల ప్రదర్శితమైంది కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement