సాక్షి, ఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) దేశ రాజధాని ఢిల్లీలో తొలి అడుగు పెట్టేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఈ నెల 14న బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్.. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో యాగాలు
మంగళ, బుధవారాల్లో పార్టీ కార్యాలయంలో జరిగే రాజశ్యామల, నవచండీ యాగాల్లో కేసీఆర్ సతీసమేతంగా పాల్గొంటారు. మంత్రి వేముల, ఎంపీ సంతోష్ కుమార్.. వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి మూడురోజులుగా.. యాగాలు, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. హోమాల్లో పాల్గొనేందుకు శృంగేరీ పీఠం నుంచి 12 మంది రుత్వికులు రానున్నారు. శృంగేరీ పీఠం గోపీశర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరగనున్నాయి. యాగశాల ప్రాంతంలో 300 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, యాగశాల సంస్కారం,యాగశాల ప్రవేశం, చండి పరాయణములు, మూల మంత్ర జపములు తదితన కార్యక్రమాలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment