చెన్నై: తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటి వాటా విడుదలపై కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం స్టాలిన్ ఖండించారు. ఆయన మంగళవారం కావేరీ జలాల వివాదంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటిని విడుదల చేయకపోవటాన్ని తప్పుపట్టారు.
‘కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయకపోవటాన్ని అఖిలపక్షం తీవ్రంగా ఖండించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటి వాటాను విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీని కోరుతున్నాం’ అని తెలిపారు.
ఇక.. కర్ణాటక ప్రభుత్వం కేవలం 8వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తమిళనాడుకు విడుదల చేస్తామని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆదివారం నుంచి మళ్లీ కావేరీ జలాల వివాదం తెరపైకి వచ్చింది. అయితే తమిళనాడుకు వెయ్యి క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేయాల్సి ఉంది.
నిన్న(సోమవారం) కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం అనంతరం తమిళనాడు కావేరీ నీటి పంపిణీపై నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ‘మేము ప్రతిరోజు ఒక టీఎంసీ కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేయలేం. కేవలం 8 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయగలమని కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment