అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సన్నాహాల నడుమ ఒడిశాలో జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. దీనిని శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప్ (ఎస్ఎస్పీ) లేదా జగన్నాథ టెంపుల్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టును బుధవారం (జనవరి 17) ప్రారంభించనున్నారు.
కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా ఒడిశాలోని పూరీ ప్రాంతాన్ని వివిధ రకాలపూలు, రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించారు. మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన ‘మహాయాగం’ మంగళవారం రెండో రోజు కూడా కొనసాగగా, బుధవారం మధ్యాహ్నం గజపతి మహారాజు దిబ్యాసింగ్ దేబ్ నిర్వహించే ‘పూర్ణాహుతి’తో ముగుస్తుంది. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనున్నారు.
జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు, జగన్నాథుని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుని దర్శనం కోసం భక్తులు నేటి ఉదయం నుంచే బారులు తీరారు.
హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి 80 ప్లటూన్‌ల పోలీసు బలగాలను (ఒక ప్లాటూన్‌లో 30 మంది పోలీసులు) మొహరించినట్లు శ్రీ జగన్నాథ ఆలయ హెరిటేజ్ కారిడార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) తెలిపారు. దాదాపు 100 మంది సూపర్‌వైజరీ అధికారులు, 250 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారులు కూడా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ కింద రూ. 800 కోట్ల వ్యయంతో జగన్నాథ ఆలయంలోని మేఘనాద్ పచేరి (బయటి గోడ) చుట్టూ భారీ కారిడార్లు నిర్మించారు. ఇది 12వ శతాబ్దపు ఆలయాన్ని ఒక క్రమ పద్ధతిలో సందర్శించడానికి భక్తులకు సహాయపడుతుంది. పూరీని ప్రపంచ వారసత్వ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాలయ వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది.
పూరీలో శ్రీ జగన్నాథ్ పరిక్రమ ప్రాజెక్ట్ ప్రారంభం రోజున అంటే జనవరి 17న ప్రభుత్వ సెలవు దినంగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. కారిడార్ ప్రాజెక్ట్‌లో పార్కింగ్ స్థలం, శ్రీ సేతు, పుణ్యక్షేత్రం, జగన్నాథ ఆలయ యాత్రికుల రాకపోకలకు కొత్త రహదారి, టాయిలెట్లు, క్లాక్ రూమ్‌లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా గల 90 ప్రముఖ ఆలయాల ప్రతినిధులను శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా విభాగం ఆహ్వానించింది.
Comments
Please login to add a commentAdd a comment