ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌ | Congress 400 Workers Qiut To Party In Rajasthan | Sakshi
Sakshi News home page

పొత్తు ఎఫెక్ట్‌.. ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌

Published Sat, Apr 13 2024 11:16 AM | Last Updated on Sat, Apr 13 2024 11:39 AM

Congress 400 Workers Qiut To Party In Rajasthan - Sakshi

జైపూర్‌: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. రాజస్థాన్‌లో ఒకేసారి 400 మంది కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో, ఈ ఘటన రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌ హస్తం పార్టీ నాయకత్వం ఖంగుతింది.

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ(ఆర్‌ఎల్‌పీ) మధ్య పొత్తు ఖరారైంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా నాగౌర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆర్‌ఎల్‌పీ చీఫ్‌ హనుమాన్‌ బేనివాల్‌ను అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ బేనివాల్‌ పేరును ఖరారు చేసింది. దీంతో, కాంగ్రెస్‌ నేతలకు బేనివాల్‌ ఎంపిక నచ్చలేదు. ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్‌ నేతలు.. బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధాకు అనుకూలంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసి బేనివాల్‌.. కాంగ్రెస్‌ నేతలు వ్యవహారాన్ని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. 

అసలు విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ హైకమాండ్‌ దిద్దుబాటులో చర్యలో భాగంగా ముగ్గురు కాంగ్రెస్‌ నేతలను ఆరేళ్ల పాటు సస్పెండ్‌ చేసింది. సస్పెండ్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే భరరామ్, కుచేరా మున్సిపాలిటీ చైర్‌పర్సన్ తేజ్‌పాల్ మీర్జా, సుఖరామ్ దొడ్వాడియాలు ఉన్నారు. దీంతో, హైకమాండ్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముగ్గురు కాంగ్రెస్ నేతలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే వీరికి మద్దతు తెలుపుతూ సుమారు 400 మంది హస్తం కార్యకర్తలు తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు సమాచారం. 

ఈ సందర్భంగా తేజ్ పాల్ మీర్జా మీడియతో మాట్లాడుతూ..‘నాగౌర్‌లో కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి బేనివాల్‌ ప్రయత్నిస్తున్నాడు. అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఇష్టం లేదు. అందుకే వారంతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అభ్యర్థిని ఖరారు చేసే ముందు హైకమాండ్‌ మా అభిప్రాయం తెలుసుకోవాల్సింది. కాంగ్రెస్‌ను ఓడిచేందుకు మాత్రమే ఆర్‌ఎల్‌పీ పనిచేస్తుంది’ అని ఆరోపణలు చేశారు. మరోవైపు.. కాంగ్రెస్‌ నేతలు మాత్రం తమ పార్టీ కార్యకర్తలు రాజీనామా చేయలేదన్నారు. ఇదంతా బీజేపీ నేతలు ఆడుతున్న డ్రామా అని కొట్టిపారేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement