న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వ చేతగానితనమే కారణమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రభుత్వ డొల్ల నినాదాలను ప్రజలు ఎంతమాత్రం నమ్మడం లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడమే పనిగా పెట్టుకుందని, అందుకే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు. జనం కష్టాల్లో ఉంటే బీజేపీ మాత్రం అధికారం కోసం పాకులాడుతోందని దుయ్యబట్టారు.
ఈ మేరకు ఖర్గే బుధవారం ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశంలోకి దూసుకెళ్తున్నాయని, నిరుద్యోగం 8.45 శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని, పనులు లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల ముందు అచ్చే దిన్, అమృత్ కాల్ అంటూ నినాదాలు ఇచి్చన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించారని ఖర్గే ఆక్షేపించారు. ఈసారి ఎన్నికల్లో ఎన్ని రకాలుగా ప్రచారం చేసుకున్నా ఫలితం ఉండదని, బీజేపీని జనం ఓడించడం తథ్యమని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment