న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తిరోగమన పాలనా విధానాల వల్లే దేశ అప్పు గత 9 ఏళ్ల బీజేపీ పాలనలో మూడు రెట్లు పెరిగిందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదలచేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్‌చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘మోదీ పాలనలో దేశ అప్పు ఈ 9 ఏళ్లలో మూడు రెట్లు ఎగసి రూ.155 లక్షల కోట్లకు చేరింది.
2014లో ఈ ప్రభుత్వం వచ్చిననాటి నుంచి లెక్కిస్తే అదనంగా రూ.100 లక్షల కోట్ల అప్పు పెరిగింది. గుజరాత్‌కు సీఎంగా ఉన్న కాలంలో మోదీ.. అసమర్థులు, అవినీతిపరులు, సత్తాలేని వాళ్లు అంటూ ఇతర పార్టీల ప్రభుత్వాలను విమర్శించేవారు. వాస్తవానికి ఈ గుణాలు మోదీకే సరిగ్గా సరిపోతాయి. దేశార్థికాన్ని దారుణంగా దెబ్బతీసి నిరుద్యోగం, ధరల్ని పెంచేశారు. గత 67 ఏళ్లలో 14 మంది ప్రధానులు మొత్తంగా రూ.55 లక్షల కోట్లు అప్పు చేస్తే మోదీ ఒక్కరే రూ.100 లక్షల కోట్లు పెంచేశారు.
ఆర్థికవ్యవస్థను సరిదిద్దడమంటే జాతీయమీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడం, టెలీప్రాంప్టర్ సాయంతో సుదీర్ఘ ప్రసంగాలు దంచేయడం, వాట్సాప్‌లో సందేశాలు ఫార్వార్డ్ చేయడం లాంటి పనికానే కాదు’ అని అన్నారు. ఆదాయ అంతరాలను ఈ ప్రభుత్వం పెంచేసింది. జనాభాలో కేవలం 10 శాతమున్న సంపన్నుల వద్ద ఏకంగా 80 శాతం సంపద పోగుబడింది. జీఎస్టీ వసూళ్లలో వీరి వాటా మూడు శాతమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment